ఈ వేదిక ఎందుకు, దీనిని ఉపయోగించుకోవడం ఎలా?

Locked
Admin
Site Admin
Posts: 18
Joined: Sat May 08, 2021 3:02 am

ఈ వేదిక ఎందుకు, దీనిని ఉపయోగించుకోవడం ఎలా?

Post by Admin »

మాస్టరు యోగంగా యోగ సాధక సమాజంలో ప్రచారంలో ఉన్న భృక్త రహిత తారక రాజ యోగం పదకొండు దశాబ్దాల క్రితం 29-5-1910 న ఆరంభమయింది. యోగ సంబంధమైన విషయాలు డైరీలు, యమ్. కోర్సు వివరణ, మాస్టరు యొక్క కోర్సు, మాస్టరు యొక్క ప్రాక్టీసు మొదటి ఆది, స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ కోర్సుల (మెర్చరీ నుండి టి. కోర్సు వగైరాల) వివరణలు, నోట్సు, ది ప్లానెటరీ లీడింగు నోట్సు అనే పేర్లతో స్థూల మాస్టరు సీ.వీ.వీ. గారి ద్వారానూ మరియు కె. కోర్సు, విద్యార్థి ద్వారా రికార్డు, యస్.యస్. ద్వారా నోట్సు అనే పేర్లతో ముగ్గురు ట్రాన్సు మీడియములలో ఒకడయిన యస్. సుందరం ద్వారానూ లిఖించబడ్డాయి. ఈ మాస్టరు రికార్డులలో వివరించబడిన విషయాలు ఒక పట్టాన అర్థంకాని పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవడమే ఎంతయినా సమంజసం.

ఆ కాలం నాటి మీడియముల మరియు తదుపరి కాలంలో సీనియరు యోగ సాధకుల రచనా వ్యాసంగాల ద్వారా మాత్రమే యోగం గురించి తెలిసే అవకాశం కలిగి ఉండింది. 1910 లో యోగం ఆరంభమైన తరువాత దాదాపు ఈ 111 సంవత్సరాలలో యోగ విషయాల మీద అనేకానేక పుస్తకాలు, వ్యాసాలు వెలుగుచూశాయి.

కానీ, ప్రస్తుత యోగ సాధక సమాజంలో వస్తుతః నెలకొని ఉన్న ప్రస్తుత చిత్రమాలిక ఏమిటి అంటే యోగం అంటే ఏమిటి, యోగ సూత్రం ఏమిటి, యోగ లక్ష్యం ఏమిటి, యోగ లక్ష్య సిద్ధి అంటే ఏమిటి అనేవాటి గురించి యోగ సాధక సమాజం తమకు తాము సంతృప్తికరంగా ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. యోగం అనే మాటను ఒక ఏకమొత్తంగా తీసుకుని దానికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకోవడాన్ని ప్రక్కన పెడితే, యోగ పరిభాషలో తరచుగా వాడబడే సర్వసాధారణ పదాలకు/పదజాలాలకు సైతం తగు సంతృప్తికర స్థాయికి అర్థాలను చెప్పుకోవడం మరియు అవగాహన చేసుకోవడం సాధ్యపడకుంది.

ప్రస్తుత చిత్రమాలిక నేపథ్యంలో, సర్వసాధారణంగా వాడబడే యోగ పదాలను తీసుకుని వాటి ద్వారా యోగం గురించిన అవగాహన కలిగించుకోవడం ఎందుకు చేయకూడదు అనే ఒక తలంపు కలిగింది. ఇది ఎవరికో వివరించడం కోసం కాదు, ఒక సంతృప్తికరమైన స్థాయికి కనీసంగా మనకు మనం వివరించుకోవడం కోసం మాత్రమే.

ఈ దిశగా, సాధారణ వాడుకలో ఉన్న యోగ పదాల ఆధారంగా మనకు మనమే ప్రశ్నలు వేసుకుని, యోగ విషయాల అవగాహనలో ముందుకు వెళ్ళడం సమంజసమేనని ఒక భావన కలిగింది.

ఇందులో ఒక ఆరంభంగా, యోగ లక్ష్యంగా పరిగణించబడుతున్న 'మృత్యువును జయించడం' మరియు'స్థూల అమృతత్వం' అనే పదాలను తీసుకుని చూద్దాం. ఇక్కడ మన ప్రశ్న ఏమిటి అంటే - 'మృత్యువును జయించడం అంటే ఏమిటి', 'స్థూల అమృతత్వం అంటే ఏమిటి', 'రెండూ ఒకటేనా', 'అయితే, ఎలా', 'కాదంటే, వాటిని భిన్నంగా చూపేది ఏమిటి లేదా వాటి మధ్యన ఉన్న తేడా ఏమిటి'.

ఈ దిశగా చేయబడుతున్న ఈ చిన్న ప్రయత్నం ఆసక్తి కలిగిన యోగ సాధకులు దీనిలో క్రియాశీలకంగా పాల్గొనడం లేదా పాలుపంచుకోవడం వలన మాత్రమే ముందుకు సాగనవుతుంది. ఆ పాలుపంచుకోవడం అనేది వేసుకుంటున్న ప్రశ్నలకు వివరణలు ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారానూ కావచ్చు లేదా యోగ సాధక సమాజం మొత్తానికి వర్తించేలాంటీ నిర్దిష్టమైన లేదా సాధారణమైన ప్రశ్నలను లేవనెత్తడం ద్వారానూ కావచ్చు. ఏదయినప్పటికీ, యోగ సాధక సమాజం లోని ప్రతి ఒక్కరికి సమాచారంగా లేదా అవగాహనగా ఉపయోగపడే నిమిత్తం మాత్రమే.

యోగ అవగాహన వేదిక యొక్క ఉద్దేశ్యం - తరచుగా వాడే యోగ పదాల ద్వారానూ, అంతకుమించి యోగ అవగాహనకు అవకాశాన్ని కలిగించేలాంటి ఏవయినా ఇతర సాధారణ అంశాల ద్వారానూ యోగ అవగాహన కలిగించుకోవడం.

ఈ కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తి యొక్క పాత్ర - తరచుగా వాడే యోగ పదాల ద్వారానూ, అంతకుమించి యోగ అవగాహనకు అవకాశం కలిగించేలాంటి ఏవయినా ఇతర సాధారణ అంశాల ద్వారానూ మాస్టరుగారి యోగా రికార్డులలో ఉన్న యోగ విషయాలకు అనుగుణంగా సమాధానాలను వివరణలుగా ఇవ్వడం.

యోగ అవగాహన వేదికను ఉపయోగించుకునే యోగ మిత్రుల పాత్ర - యోగ సంబంధమైన తమ ప్రశ్నలను/సందేహాలను, సమాధానాలలో వాడబడే పదాల గురించి ఉత్పన్నమయే సందేహాలను/ప్రశ్నలను, ఇంకా యోగ సంబంధమని అనిపించే ఏవయినా ఇతర సాధారణ అంశాలను వెబ్సైటు ద్వారా గానీ లేదా కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తికి వాట్సప్ ద్వారా గానీ లిఖితరూపంగా వ్యక్తం చేయడం. లిఖితరూపంగా పెట్టలేనివారు కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తికి ఫోనులో మాటల ద్వారా విషయాన్ని వ్యక్తం చేయడం (నిన్నటి 8వ ప్రశ్నలో ఒక యోగ మిత్రుడు ఒక అంశాన్ని లేవనెత్తిన మాదిరిగా).

ఇక్కడ మరల కార్యక్రమ నిర్వాహక సాధనమైన వ్యక్తి యొక్క పాత్ర - యోగ మిత్రుల ద్వారా లిఖితరూపంగా వ్యక్తం చేయబడే విషయాన్ని లేదా కొందరి చేత ఫోను ద్వారా వ్యక్తం చేయబడే విషయాన్ని పరిశీలించడం. సదరు విషయం యోగ సంబంధమైనదా కాదా అని నిర్ణయించడం. అయితే, దానిని ప్రశ్న విషయంగా పరిగణనలోకి తీసుకోవడం. ఆ ప్రశ్న విషయాన్ని తీసుకుని, దాని ద్వారా యోగ అవగాహనకు వీలు కల్పించే విధంగా (నిన్నటి 8వ ప్రశ్నలో మాదిరిగా) దానికి ప్రశ్న రూపాన్ని కల్పించడం. ఉత్తరోత్తరా ఆ ప్రశ్నకు సమాధానాలను యోగ అవగాహన వేదిక ద్వారా అందించడం.

గమనిక - ఫోనులో మాట్లాడి విషయాన్ని వ్యక్తం చేసేవారికి సంబంధించి, సదరు విషయం ప్రశ్న విషయంగా తగి ఉన్నట్లయితే, మెయిలు/వాట్సప్/మెస్సేజ్ ద్వారా వార్తాలాపంతో వాళ్ళు చెప్పిన విషయం వ్రాత రూపంగా సరిపోయింది అనే వాళ్ళ అంగీకారంతో ప్రశ్న విషయానికి వ్రాత రూపం కల్పించబడుతుంది.

కటకం సాంబశివరావు.
Guntur, A.P., India
Mobile No. 8639715695
WhatsApp No.9885740045
Locked