Page 1 of 1

సమాధానం నెం.007 - ప్రశ్న నెం.7 (9-5-2021) విషయం "యోగ లక్ష్యం".

Posted: Sat May 22, 2021 9:43 am
by Katakam
యోగ లక్ష్యం అంటే ఏమిటి?

యోగ సాధకులుగా మనం చేస్తున్న యోగం ఆరంభం కావడానికి వెనుకనున్న ఉద్దేశ్యమే/లక్ష్యమే యోగ లక్ష్యం.

యోగ లక్ష్యం ఏమిటి?

యోగ లక్ష్యం గురించి మాస్టరు గారి రికార్డులలో వాడబడిన పదజాలం 'స్థూల స్థాపన'. మృత్యువును జయించడం (ఒక సృష్టి ప్రక్రియగా), స్థూల అమృతత్వం అనేవి లక్ష్య సంబంధమైన వివరణలకు అర్థవంతమైన పదజాలాలుగా వాడుకలో ఉన్నవే అయినప్పటికీ, ఆ పదజాలాలు మాస్టరు గారి రికార్డులలో ఎక్కడా కనుపించవు. లక్ష్య సంబంధమైన యోగ ప్రక్రియను అత్యంత నిగూఢంగా సూచించే పదజాలాలయిన 'ఏకం ఏకంను చూడాలి', 'ఏకంకు చేరుకోవడానికి మనసును సంస్కరించడం', 'పూర్తి ప్రజ్ఞతో ఆ భ్రమింపచేస్తున్నదానిని చేరడం/చేరుకోవడం', వగైరా లాంటివి అర్థం కావడం అంత తేలికైన విషయం కాదు. సందర్భం వచ్చినపుడు, వాటి గురించి వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది.

స్థూల స్థాపన గురించి కొంత వివరణ. యోగ సాధకులు తరచుగా వాడే స్థూలం తయారుకావడం అనేదే స్థూల స్థాపనగా తీసుకోనవుతుంది. కానీ స్థూలం తయారుకావడం అనేది సృష్టి స్థాయి ప్రక్రియగా జరగవలసిన అవసరం. మనిషి శరీరం నుంచి ప్రాణం ఎందుకు నిలవకుండా విడిచి వెళ్ళిపోతుందో, ఆ కారణాలు చక్కదిద్దబడి, ప్రాణం స్థూల శరీరంలో శాశ్వతంగా ఉండేలా చేయబడడమే స్థూల స్థాపన. దానికి సంబంధించి ఎన్నో మితులలో వెల్లడించినవే యోగా రికార్డులు అన్నీనూ.

యోగ లక్ష్యానికి, సృష్టి లక్ష్యానికి ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?

సృష్టి ఆరంభం కావడానికి వెనుకనున్న లక్ష్యమే యోగ లక్ష్యంగా యోగ పరిభాషలో చెప్పబడుతోంది. రెండూ ఒకటే. కానీ, సాంప్రదాయబద్ధంగా మహానుభావులకు సృష్టి లక్ష్య సంబంధంగా అందిన 'సృష్టి భగవంతుని లీల, చిద్విలాసం' అనే సమాధానానికి, సృష్టి/యోగ లక్ష్యానికి సంబంధం లేదని తెలియనగును.

ఆ లక్ష్యం వ్యక్తి సంబంధమా, సృష్టి సంబంధమా, లేదా రెండూనా?

ఆ లక్ష్యం వ్యక్తి సంబంధం, సృష్టి సంబంధం రెండూనూ. సృష్టి లోని సర్వోత్కృష్ట జీవిగా మనిషి 'స్థూల స్థాపన' చెందించబడి, అది సృష్టి మొత్తానికి అందించబడడమే ఆ లక్ష్యం.

వాటి మధ్యనున్న అవినాభావ సంబంధం ఏమిటి?

సృష్టిలో మనిషి సర్వోత్కృష్ట జీవి. లోహ, వృక్ష, జంతు దశలు దాటి, ఆ దశల లక్షణాలను పుణికి పుచ్చుకుని ఉన్నప్పటికీ, తనకంటూ బుద్ధి అనే ఒక
ప్రత్యేక లక్షణాన్ని సంతరించుకుని ఉన్న మనిషితోనే సృష్టి లక్ష్యం ముడిపడి ఉంది. సృష్టి లక్ష్యం గానీ, యోగ లక్ష్యం గానీ మానవ స్థూలం స్థాపన కావడానికి లేదా తయారుకావడానికి మాత్రమే సంబంధించి ఉంది.

సృష్టి ఆరంభం మొదలుకుని ఇప్పటివరకు జరిగిన క్రమవికాసం మొత్తానికి ప్రతీక మనిషి. విశ్వ వ్యాప్తంగా ఉన్న మనుషులలో ఉన్న సమస్తానికి సమిష్టి రూపమే సృష్టి.

మనిషికి మరణం ఎలాగో సృష్టికి లయ విలయ ప్రళయాలు అలాగ. మనిషికి అమృతత్వం రావాలి అంటే సృష్టికి లయ విలయ ప్రళయాలు లేకుండా పోవాలి.

సాంప్రదాయబద్ధంగా చెప్పబడిన మోక్షం అనే మాటకు, యోగ లక్ష్యానికి సంబంధం ఉందా? ఉంటే, ఎలాంటి సంబంధం?

సాంప్రదాయబద్ధంగా చెప్పబడిన మోక్షం అనే మాటకు ఉన్న అసలయిన అర్థంలో సృష్టి లక్ష్యం, యోగ లక్ష్యం, మోక్షం మూడూ ఒకటే. మాస్టరు గారి డైరీలో 14-11-1912 న వేయబడిన ఏడు ప్రశ్నలలో 'మోక్షమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి', 'ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి' అనే రెండు ప్రశ్నలలో ఈ భూమికి, ఈ స్థూలానికి (మానవ స్థూలానికి) మోక్షమనే లక్ష్యం పరంగా ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోమనేదే వాటి ఖచ్చితమైన పరోక్ష సూచన.

అభ్యర్థనాపూర్వక వేద సూక్తమైన 'మృత్యోర్మా అమృతం గమయ' (అంటే మృత్యువు నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది) అనేదానికి, అలాగే ఈశావాస్య ఉపనిషత్తు లోని 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే' (అంటే అవిద్య చేత మృత్యువును గడచి, విద్య చేత అమృతత్వమును పొందుతారు) మరియు 'వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతమశ్నుతే' (అంటే వినాశం చేత మృత్యువును గడచి, సంభూతి చేత అమృతత్వమును పొందుతారు) అనే శ్లోక భాగాలకు, యోగ/సృష్టి లక్ష్యానికి ఉన్న సంబంధం ఏమిటి?

మృత్యోర్మా అమృతం గమయ - ఈ వేద సూక్తం యొక్క అర్థం డైరెక్టుగా యోగ లక్ష్యానికే సంబంధించింది. కాకపోతే, ఈ సూక్తం కేవలం సూత్రప్రాయం మాత్రమే.

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే - క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, నడుస్తున్న సృష్టికి సంబంధించిన ఏ అనుభవం, జ్ఞానం కర్మగా రూపొంది విద్యగా పరిగణించబడుతోందో, అది లేకుండా పోవడం (అవిద్య) ద్వారా జ్ఞాన సంబంధ మృత్యువు గడవబడుతుంది. ఉన్న ఉండకూడని జ్ఞానం పోయిన పిమ్మట రావలసిన అనుభవం, జ్ఞానం రావడం లేదా తెలియవలసింది తెలియడం (విద్య) ద్వారా జ్ఞాన సంబంధమైన అమృతత్వం పొందబడుతుంది. ఇవి యోగ లక్ష్య సిద్ధిలో ప్రాథమిక స్థాయిలు.

వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతమశ్నుతే - క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, ఏ కర్మ పదార్థం స్థూల శరీర నిర్మాణంలో మృత పదార్థంగా ఉపయోగపడిందో, అది విశేషంగా నాశనం అయిపోవడం (వినాశం) ద్వారా స్థూల సంబంధ మృత్యువు గడవబడుతుంది. ఉన్న ఉండకూడని మృత పదార్థం పోయిన పిమ్మట అమృత పదార్థం స్థూలం లోకి రావడం (సంభూతి) ద్వారా స్థూల సంబంధ అమృతత్వం పొందబడుతుంది. ఇది యోగ లక్ష్య సిద్ధి లోని చరమ స్థాయి.

మోక్షం అనే మాటకు, వేద సూక్తానికి, శ్లోక భాగాలకు అప్పట్లో మహానుభావులకు తోచిన అర్థాలు అప్పటి అవసరం మేరకు పరిమిత స్థాయిలోనివి మాత్రమే. వాటికి అసలైన అర్థాలు యోగ పరంగా మాత్రమే బయటపడదగినవి, బయటపడ్డాయి.