Page 1 of 1

సమాధానం నెం.109 - ప్రశ్న నెం.109 (2-12-2021) విషయం "ప్రాణాయామ సాధన, ఈ యోగం".

Posted: Tue Dec 07, 2021 7:56 am
by Katakam
1) ఈ యోగంలో ప్రాణాయామ సాధన కూడదు అంటారు. అది నిజమేనా?

2) అవును, నిజమే. మాస్టరు గారి డైరీలలో 2-3-1919 న "జగ్గారావు గురించి" "స్వయం సూచన" గా వచ్చిన దానిలో "ఈ యోగంలో అనుసరించడానికి విరక్తి మార్గం అనేదే లేదు. ప్రాణాయామ సాధన లేదు" అని వ్రాయబడి ఉన్నదే దీనికి నిర్ధారణ. ప్రాణాయామ సాధన లేదు అని ఉంటే, ప్రాణాయామ సాధన కూడదు అనే అర్థం ఎలా సమర్థనీయం అనేది సమంజసంగా వేసుకోదగిన ప్రశ్నయే కదా. ఈ యోగంలో లేదా ఈ యోగ ప్రాక్టీసులో ప్రాణాయామ సాధన లేదు అని అన్నపుడు, ప్రాణాయామ సాధన అనేది వస్తుతః అవసరం లేదు అనేది మామూలుగా చెప్పుకోదగిన అర్థం. కానీ, లేదు అనే దానిని కూడదు అని చెప్పుకోవాలి అంటే విషయం పరంగా, సాధన పరమైన లోతుల పరంగా వివరించి చెప్పుకోవలసిందే.

3) ఈ యోగంలో ప్రాణాయామ సాధన కూడదు అని అనడానికి కారణాలు ఏమిటి?

4) ముందుగా, ప్రాణాయామ సాధన అంటే ఏమిటో కొంత కొంత చెప్పుకోవాలి. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని యమించడం లేదా నియంత్రించడం లేదా దాని వలన నెరవేరే పనులకు సంబంధించి కోరుకున్న దానికి అనుగుణంగా దానిని క్రమబద్ధం చేయడం. ఇంతకీ, ఇక్కడ ప్రాణం అంటే మనిషిలో ఉండి, మనిషి బ్రతికి ఉండడానికి కారణం అయిన ప్రాణం కాదు. ఇది కేవలం శ్వాస ప్రక్రియ ద్వారా లోనికి ప్రవేశించే ప్రాణవాయువు మాత్రమే. మామూలుగా లోపలికి ప్రవేశించే ప్రాణవాయువు యొక్క మోతాదుకు మించి ప్రయత్న పూర్వకంగా అధికంగా తీసుకుని పూరక కుంభక రేచక ప్రక్రియలతో చేయబడే సాధనయే ప్రాణాయామ సాధన. దీనిలో జరిగేది మనిషిలో లక్షణ పరమైన మార్పులకు ఏమాత్రం దారితీయని, దోహదపడని కుండలినీ శక్తులు సాధించబడడమే.

5) కాకపోతే, సాధించబడే కుండలినీ శక్తులు మనిషిలో ఉన్న వివిధ స్థాయిలలో లేదా దశలలో దేనికి సంబంధించినవి అనేది సదరు సాధకులకు తెలియనిది మాత్రమే కాదు, పట్టని పట్టించుకోని పట్టించుకోజాలని విషయం కూడ. కుండలినీ శక్తులు మహా శక్తివంతమైన యాస్ట్రలు అనే అథో తలానికి మాత్రమే సంబంధించినవి. మనిషికి సంబంధించిన ఏడు తలాల లోను మార్పు తీసుకురావడానికి సంబంధించింది ఈ నూతన యోగ విధానం. అందులో ముఖ్యంగా చక్కదిద్దబడవలసిన తలం యాస్ట్రలు తలమే. ఆ యాస్ట్రలు తలానికి మాత్రమే సంబంధించింది ప్రాణాయామ సాధన. అది ఈ యోగంలో లేకపోవడమే కాదు, ఈ యోగా ప్రాక్టీసుకు అవరోధం కూడ అవుతుంది గనుకనే, ప్రాణాయామ సాధన లేదు అన్న దానిని ప్రాణాయామ సాధన కూడదు అని సమంజసంగానే అర్థం చేసుకోబడింది, అలాగే ప్రచారం చేయబడింది కూడ.

6) ప్రాణాయామ సాధన చేసేవారు ఈ యోగానికి అనర్హులా?

7) అనర్హులు కాదు అని ఖచ్చితంగా చెప్పుకుని, దానికి వివరణ చెప్పుకోవలసిన అవసరం. ప్రాణాయామ సాధన ప్రస్తుత సృష్టి విధానానికి మాత్రమే సంబంధించి ఉంది. నూతన సృష్టి విధాన ఆవిష్కరణకు సంబంధించిన ఈ యోగ విధానంలో ప్రాణాయామ సాధన లేదు, చేయనక్కర లేదు, చేయకూడదు అని పైన చెప్పుకోవడం జరిగింది. అంటే జన్మజన్మల సాధనల ఫలితంగా దేహ వ్యవస్థకు అలవాటు అయిపోయిన కారణంగా ప్రాణాయామ సాధన ప్రభావం నుండి బయటపడడం కూడ ఈ యోగా ప్రాక్టీసులో భాగమే.

8) గత జన్మలో చేసిన ఆధ్యాత్మిక సాధనల దృష్ట్యా ఈ యోగంలో చేరడానికి అర్హత సాధించుకున్న మహానుభావులు గత జన్మల ప్రభావాల నుండి విముక్తం కావడం కూడ భాగమైన ఈ యోగ విధానంలో ప్రస్తుత సృష్టి విధానపు వ్యక్తిగత ఆధ్యాత్మిక డెవలప్మెంటుకు దారి తీసిన ప్రాణాయామ సాధన అనర్హత కానేరదు, కాకపోతే ఈ యోగంలో అది కూడదు, అంతే.