మాస్టరు యోగంగా ప్రచారంలో ఉన్న మన యోగం అసలు పేరు 'భృక్త రహిత తారక రాజ యోగం' అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ పేరు యోగ సాధక సమాజానికి అందుబాటులోకి వచ్చిన మాస్టరు యోగ సాహిత్యంలో (మాస్టరు గారి ద్వారా మరియు సుందరం ద్వారా లిఖించబడిన రికార్డులు మాత్రమే మాస్టరు యోగ సాహిత్యంగా పరిగణించబడతాయని ఈ సందర్భంగా తెలియనగును) ఎక్కడా కనుపించదు. అప్పటి మీడియములు శ్రీ పి.యన్. గారు, శ్రీ యస్.యన్. గారు, మొదలైనవారు యోగ సంబంధంగా వ్రాసిన పుస్తకాలలో మాత్రమే ఈ పేరు కనుపిస్తుంది. ఇది విషయంగా తెలియడం కోసమే చెప్పబడుతోంది తప్ప, దాని వాస్తవికతను ప్రశ్నించడానికి కాదని వినయపూర్వకంగా తెలియచేయబడుతోంది.
ముఖ్యంగా యస్. నారాయణ అయ్యరు గారు ఆంగ్లంలో వ్రాసిన 'ది న్యూ యోగ' (నూతన యోగం) అనే పుస్తకం లోని ముందుమాటలో 'భృక్త రహిత తారక రాజ యోగం' అనే పేరు కనపడుతుంది. ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం ఎందుకు అంటే ఈ ముందుమాటలోని శైలి, భావగాంభీర్యం, అర్థగాంభీర్యం చూస్తే మాస్టరు యోగ రికార్డులతో పోలిక కనుపిస్తుంది. ఇది యం.టీ.ఏ. ద్వారా వచ్చి ఉంటుందని ఒకలాంటి నమ్మకం కూడ.
ముందుగా భృక్త రహిత తారక రాజ యోగం అనే మొత్తం పేరుకు అర్థం చెప్పుకుని, ఆ తరువాత ఒక్కొక్క మాటకు వివరణ/అర్థం చెప్పుకుందాం.
ఇంతవరకు బయటపడని బృహత్ సృష్టి రహస్యాలను మహా సృష్టి లేదా మహత్తు సృష్టి స్థాయి క్రియల మాధ్యమంగా స్థూల సృష్టిలోని స్థూల మానవ రూప మీడియముల స్థూల శరీరాలు సాధనాలుగా మూల/శూన్య స్థాయి ప్రక్రియల ద్వారా బయల్వెడలచేసి/వెలికితీసి, సదరు ప్రక్రియల ఫలితాలుగా అగ్నికీలలతో మూల మరియు సూక్ష్మ స్థాయిల కర్మ పదార్థాన్ని వేల్చి శూన్యీకరించడం అనే నభూతో ప్రక్రియ ద్వారా సృష్టి సమస్తానికి హితం చేకూర్చేటందుకు, ప్రస్తుత కర్మ విధానం లోని జననమరణ విషవలయం నుండి తరింపచేసే నిమిత్తం, మనిషి లోని సర్వ స్వతంత్ర రాజధర్మాన్ని లేదా దివ్యత్వాన్ని లేదా దైవ/భగవత్తత్త్వ అంశను లేదా ప్రాణతరంగాన్ని ఉద్దీప్తం చేసి,
ప్రాణాన్ని స్థూలంలో యోగించి స్థూల స్థాపన చేయడం కోసం సంకల్పించబడిన విధానం.
భృక్తం - అక్షరాల మూల భావాలతో లేదా మూల అక్షరాల భావాలతో -అంటే అక్షర రూప శబ్దాలు వెలువడడానికి ముందుగా నిశ్శబ్దం నుండి వెలువడిన అస్పష్ట ధ్వనులలో ఇమిడి ఉన్న మూల/అరూప భావాల సంయోగంతో- కూర్చబడిన భృక్తం అనే ఈ పదం భాషా పదజాలంలో ఎక్కడా కనపడదు. యోగ సాహిత్యంలో భాషకు అందని విధంగా ఉన్న పదాలు కూర్చబడిన సరళికి ఆంగ్ల "అథారిటేటివ్ ఆథెంటిక్ ఆటోబయాగ్రఫిక్ వేవ్స్ ఆఫ్ అనమటోపియా', గ్రాంధిక తెలుగు అర్థంలో 'స్వస్వప్రేరణాదక్ష స్వసంజనిత స్వజీవచిత్రణా (కల్పనా రచనా నిర్మాణ నిర్వహణా) దక్ష లక్ష్యవస్తుభావనాయుక్త ధ్వనితరంగాలు', అర్థమయే తెలుగులో 'తనకు తాను ప్రేరణ కాగలిగిన, తన నుండి తాను జనియించిన, తన జీవాన్ని/ప్రాణాన్ని తాను చిత్రించుకో (కల్పన రచన నిర్మాణ నిర్వహణ చేసుకో) గలిగిన, లక్ష్య సంబంధమైన వస్తువును సదా భావనలో ఉంచుకునే ధ్వనితరంగాలు) అనే యోగ పదజాలమే ఆధారం.
భృక్తం అంటే గుప్తంగా రహస్యంగా ఉన్నటువంటిది. మన యోగం వస్తుతః మూలానికి, సృష్టి విధానానికి సంబంధించింది గనుక సృష్టికి సంబంధించిన గుప్త/రహస్య విషయాలు అర్థం కాబడకుండా ఉండడమే భృక్తం.
రహితం - రహితం అంటే లేకుండా పోవడం లేదా శూన్యీకరించబడడం. మూల భావాలకు వెళ్లి చెప్పుకుంటే, రహితం అంటే అగ్ని సంభూత ప్రక్రియల ద్వారా హితాన్ని/మేలును కలగచేయడం.
తారకం - తరింపచేసేది అయిన. తరింపచేయడం అంటే కర్మసంబంధ విధానానికి ఆయువుపట్టు అయి ఉన్న జననమరణ పరంపర అనే విషవలయం నుండి మానవ కోటిని ఈ భూమి మీద ఈ స్థూలం లోనే ఉంచి దాటించడం.
రాజ - ప్రతి ప్రాణికి రాజు సర్వ స్వతంత్రంగా ఉండగలిగిన ప్రాణమే. అది లేకుండా ఏ స్థూలానికి ఉనికి ఉండదు. ఆ రాజును రాజుగా వ్యవహరించగలిగేలా చేయడమే రాజ అనే మాటలో ఇమిడి ఉన్న అర్థం.
యోగం - యోగం అంటే కలయిక, మూలం/ప్రాణం స్థూలంలో కలవడం, ఎప్పటికప్పుడు ఏ జన్మకు ఆ జన్మకు స్థూలాన్ని విడిచి తిరిగి ప్రాణంలో కలిసిపోయే ప్రాణతరంగాల స్థానంలో ప్రాణమే స్థూలం లోకి దిగిరావడం. సుందరం ద్వారా ప్రాణాన్ని తీసుకురావడానికి, దానితో చనిపోతున్న చందును బ్రతికించడానికి మాస్టరు గారు చేసిన ప్రయత్నాలే యోగంలో ప్రాణం స్థూలం లోకి దిగిరావడం అనే యోగ ప్రక్రియకు ఆనవాలు కాదా.
పదాలకు అర్థాలను వివరించడం అనేది యోగ సాహిత్యంలో చాలా చాలా తక్కువ, దాదాపుగా లేదనే చెప్పవచ్చు. వాటికి సంబంధించిన సృష్టి/వ్యక్తి స్థాయి ప్రక్రియలు మాత్రమే గుంభన పదజాలంలో వివరించబడి ఉన్నాయి. ఆ ప్రక్రియల సారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే యోగపరంగా, యోగ సాహిత్య
పరంగా అర్థాలు చెప్పుకోబడుతున్నాయి.
సమాధానం నెం.009 - ప్రశ్న నెం.9 (12-5-2021) విషయం "భృక్త రహిత తారక రాజ యోగం అనే మాటలకు అర్థం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm