Page 1 of 1

సమాధానం నెం.010 - ప్రశ్న నెం.10 (16-5-2021) విషయం "ప్రత్యేకించి ఈ యోగం ఆరంభించబడవలసిన అవసరం".

Posted: Thu May 27, 2021 9:28 am
by Katakam
1) వందల వేల సంవత్సరాల నుండి పరంపరగా వస్తున్న అనేక యోగ మార్గాలు ఉన్న తరుణంలో మాస్టరు సీ.వీ.వీ. గారు సరికొత్తగా మన యోగాన్ని ప్రారంభించవలసిన ఆవశ్యకత ఎందుకు కలిగింది?

2) సృష్టి ఆరంభమైన పిమ్మట లోహ వృక్ష జంతు దశల అనంతరం మానవ రూప దశ ఆరంభమై, మిగతా జీవ దశలకు లేని ఒక ప్రత్యేకతను మానవ రూపం సంతరించుకుంది. అదే బుద్ధి. అందుచేతనే మనిషిని బుద్ధి జీవి అన్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణంలో జరిగేవాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం మనిషి దశకే పరిమితం అయ్యింది. ఆ కుతూహలం మేథస్సు పరిఢవిల్లుడుకు దారితీసింది. ఆ మేథస్సు పరిఢవిల్లుడు ఏ మేరకు అంటే తన పంచేంద్రియాల మరియు మానసిక ఆలోచనల పరిధిలోకి వచ్చిన దేనికైనా తార్కికంగా, హేతుబద్ధంగా సమాధానాన్ని చెప్పుకునేటంత. ఆ పరిధి దాటబడి సూక్ష్మ విషయాల లోతులకు వెళ్ళడానికి ఏకాంతంగా సాధనలు, పరిశోధనలు చేస్తేగాని సమాధానాలు రాని పరిస్థితి ఏర్పడింది. అలా సామాజిక జీవనానికి దూరంగా ఏకాంతవాసానికి, సాధనకు, పరిశోధనకు అలవాటు పడిపోయిన వారు స్థాయిలవారీగా సాధకులు, మునులు, మహా మునులు, ఋషులు, మహర్షులు/రాజర్షులు, బ్రహ్మర్షులు అయ్యారు. వ్యక్తిగత విషయాలను మించి సృష్టిగత విషయాలు వారి వ్యాపకం అయ్యింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప సూత్రం అంది, వాటి లోతులను తెలుసుకునే వ్యాసంగంలో గొప్ప గొప్ప విషయాలు అంది, ఎవరికి వారు వాటిని క్రమబద్ధం చేసే ప్రయత్నం, ఆ మహోన్నత విషయాలను మానవాళికి అందించాలనే తపన స్మృతులు, శాస్త్రాలు, పురాణాల రచనకు దారితీసింది. సామాన్య జన జీవనానికి దూరంగా ఏకాంతవాసంలో వారు సాధించిన లోతుల విషయ పరిజ్ఞానం వాళ్ళను జ్ఞానులుగా తీర్చిదిద్దింది. వాళ్ళనే మహానుభావులు, మహాత్ములు, మహనీయులు అన్నారు.

3) మాస్టరు గారి వద్ద చేరిన మీడియములు అందరూ అలాంటి మహానుభావులే, మహాత్ములే, మహనీయులే. సర్వ కాలాలలో ప్రసిద్ధికెక్కిన మహానుభావులే అందరూనూ. నారదుడు, సూర్యుడు, ఇంద్రుడు, కాకా భుజంధరుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, దశరథుడు, జనకుడు, కుంభకర్ణుడు, భీష్ముడు, విదురుడు, నకులుడు, విజయుడు, సాత్యకి, బుద్ధుడు, రామకృష్ణ (పరమహంస), రామయోగి, యాకూబు, పెరియాళ్వారు, ఏడు గ్రహాలు - అందరూ మాస్టరు గారి కాలంలో జన్మించి మీడియములు అయినవారే, యోగంలో చేరినవారే, ఆధ్యాత్మికంగా మహోన్నత స్థాయిలు పొందిన అలాంటి మహాత్ములు మాస్టరు గారి ఆధ్వర్యంలో యోగా ప్రాక్టీసు చేసినవారే, యోగపరంగా అనామకులూగా ఉండి సామాజిక మనుగడ సాగించినవారే. యోగం ఏ స్థాయిదో తెలియడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

4) ఇపుడిక సరికొత్తగా మన యోగాన్ని ఆరంభించవలసిన అగత్యం గురించి.

5) వేల సంవత్సరాలే కాదు, సృష్టి ఆరంభమై మానవ మేథస్సు పరిఢవిల్లిన నాటి నుండి కూడ సృష్టి ఎందుకు మొదలయింది అనే ప్రశ్న, దానికి ముక్కుసూటి కాని సమాధానం తప్ప, సృష్టికంటూ ఒక లక్ష్యం ఉండి ఉండాలి, ఉంటుంది, ఉంది అనేది సృష్టిలోని ఏ స్థాయిలకూ అందని విషయంగానే ఉండిపోయింది.

6) స్థూల జన్మకు వచ్చిన మహానుభావులు, మహాత్ములు అందరూ అపార్థం చేసుకోబడిన మోక్షం గురించి ప్రయత్నించినవారే, ప్రచారం చేసినవారే, కానీ జన్మల పర్యంతం చేసిన సాధనలే వారిలో కొందరికి యోగంలో మీడియములుగా చేరే అర్హతను సాధించిపెట్టాయి.

7) ఆ మహానుభావులు, మహాత్ములు ఎవరెవరు ఎంత మహోన్నతమైన జ్ఞానం సంపాదించినా, ఎన్నెన్ని యోగాలు ప్రారంభించబడినా, ఆ జ్ఞానం గానీ సాధనలు గానీ మానవ రూపానికి ఉన్న సృష్టి లక్ష్య సంబంధమైన పరమౌన్నత్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యాయి.

8) ఏ యోగం గానీఏ సాధన గానీ మనిషిలో నీతి నిజాయితీల జీవన విధానానికి దారి తీసేలాంటి ఒక్కటంటే ఒక్క మార్పును కూడ తీసుకురాలేకపోయాయి.

9) అంతేకాదు, ఏమి జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఈషణ్మాత్రం అర్థంకాని పరిస్థితులలో మనిషిలో పతనపుటంచులకు చేరుకున్న నైచ్యం సృష్టిని దిగజార్చివేసింది, నూతన సృష్టి విధాన ఆవిష్కరణకు అవసరాన్ని ఖాయం చేసింది.

10) భృక్త రహిత తారక రాజ యోగం అనే నూతన యౌగం ఆరంభమయింది. ఆచరణకు చోటు లేని సృష్టిలో ఆచరణ సాధ్య సాధనగా యోగా ప్రాక్టీసు ఆరంభమయింది. భూత వర్తమాన భవిష్యత్తులలో భూత భవిష్యత్తులు లేకుండా పోయి అఖండ వర్తమానం ఒక్కటే మిగిలి, సృష్టికి లయ విలయ ప్రళయాలు లేకుండా ఇదే ఆఖరి సృష్టిగా, మనిషికి మరణం లేకుండా పోయి అమృతత్వం నెలకొలడానికి అంకురార్పణ జరిగింది.

11) సృష్టి ఆరంభమైనది మొదలుకుని ఇప్పటివరకు జరిగిన/జరుగుతున్న దానికి సంబంధించిన రహస్యాల కూడలియే కుండలని. సృష్టి సూత్రం ప్రకారం కుండలని తనలోని రహస్యాలను బయటపెట్టడానికి వీలులేదు. రహస్యం అంతా కుండలనీ నిక్షిప్తం. అలా రహస్యంగా/గుంభనంగా ఉండిపోయినదే లేదా ఉండిపోవడమే భృక్తం.

12) భృక్తం అనే మాట సృష్టికి మాత్రమే కాదు, వ్యక్తికి కూడ సంబంధించిందే. గత జన్మ విషయాలు తెలియకుండా కేవలం వాటి కర్మ అనే అంతర్లీన ప్రభావంతో మాత్రమే ప్రస్తుత జన్మ మనుగడ సాగిపోతోంది. ఆరంభ జన్మ నుండీ ఇదే పరిస్థితి. అంతా భృక్తమే. దీనికి లోబడి మాత్రమే మహాత్ములు, అనేకానేక యోగాలు, చివరికి ఏకంగా సృష్టి విధానం సైతం పనిచేస్తున్నాయి.

13) ప్రస్తుత సృష్టి విధానం ఒకలాంటి సమస్య. సమస్యకు పరిష్కారం రావలసింది సమస్య మూలం నుంచే కదా.

14) సృష్టి స్థాయి భృక్తం (గుప్త/రహస్య లక్షణం) రహితం (లేకుండా పోయి
హితం చేకూర్చడం) కావడం ద్వారా తారకం (తరింపచేయబడడం) చోటు చేసుకుని రాజ (స్వతంత్రత అనే రాజ) లక్షణం పనిచేయడానికి సంకల్పించబడిన యోగం (మూలం స్థూలంలో కలవడం) పనిచేస్తే తప్ప సమస్యకు పరిష్కారం లేదు. అందుకు ముందుగా సృష్టి స్థాయి భృక్తం పోవాలి. భృక్తం అయి ఉన్న కుండలనిని శాసించే శక్తి ఏ వ్యక్తికి గానీ ఏ సృష్టి శక్తికి గానీ లేదు, దానికి మూలమైన ఆరిజిను వన్ కి తప్ప. అందునిమిత్తం మొదటి ఆది నుండి కుండలనికి ఇవ్వబడిన నిర్దేశమే "గుప్త బహిస్తథ్య" (యః గుప్తః తత్ బహిః = భృక్తాన్ని/గుప్తాన్ని/రహస్యాన్ని బయటపెట్టుకోవలసింది) అని. ఇది యోగం ఆరంభం కావడానికి ముందుగానే సూక్ష్మ స్థితులలో జరిగిన ఏర్పాటుగా గమనించనగును.

15) దాని ఫలితమే మూల/బృహత్/సూక్ష్మ/స్థూల సృష్టుల సమస్త రహస్యాలను గుంభనంగా వెల్లడించిన మాస్టరు యోగ రికార్డులు సమస్తమూనూ.

16) మిగతా యోగాలకన్నా మన యోగం ఏవిధంగా భిన్నమైనది మరియు సాధకులకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలియచేయండి.

17) మన యోగానికి, మిగతా యోగాలకు ఉన్న భిన్ళత్వం గురించి ప్రశ్న నెం.4 కు సమాధానంలోను, యోగా ప్రాక్టీసు వలన ప్రయోజనం గురించి ప్రశ్న నెం.3 కు సమాధానంలోను వివరించబడి ఉంది.