Page 1 of 1

సమాధానం నెం.173 - ప్రశ్న నెం.173 (9-4-2022) విషయం "విరక్తి మార్గం".

Posted: Thu Apr 14, 2022 7:43 am
by Katakam
1) విరక్తి మార్గం అంటే ఏమిటి?

2) విరక్తి అంటే రక్తి/ అనురాగం లేకుండడం. దేని పట్ల లేదా వేటి పట్ల అంటే మానవ జన్మ తీసుకున్న దృష్ట్యా ఏ జీవన కార్యకలాపాలు (జీవనం సాగించడానికి చేపట్టబడే సమస్త జీవన కార్యకలాపాలు) భౌతిక రంగంగా సంక్రమించాయో, వాటి లోని వేటి పట్ల కూడ రక్తి, అనురక్తి, అనురాగం లేకుండడం. అంటే ఎవరితోనూ, వేటితోనూ ఎలాంటి బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు లేకుండడం లేదా వాటిని కాదనుకోగలగడం. అలా ఉండడానికి సంబంధించిన మార్గమే విరక్తి మార్గం.

3) ముక్తసరిగా చెప్పుకోవాలి అంటే మానవ జీవితం సంబంధంగా ముక్తిని, మోక్షాన్ని పొందడానికి స్వికరించవలసిన సన్యాసమే విరక్తి మార్గంగా చెప్పుకోనవుతుంది. ఇది ప్రస్తుత సామాజిక జీవన స్రవంతిలో సాధారణ మానవుల సంబంధంగా ప్రస్తావన కూడ చేయబడకపోతున్నప్పటికీ, స్వాములు, సన్యాసులు, ముల్లాలు‌, పాస్టర్లు, వగైరా ప్రత్యేక వర్గం వారంతా ఈ కోవకి/ మార్గానికి చెందినవారే. దీనికి కారణం ఏమిటి అంటే విరక్తి మార్గమే ఆధ్యాత్మికతకు, ఆధ్యాత్మికతకు లక్ష్యంగా చెప్పబడిన ముక్తికి/ మోక్షానికి లేదా భగవంతుడిలో/ దేముడిలో ఐక్యమై పోవడానికి దారితీస్తుంది అని మేథో మహానుభావుల చేత నమ్మబడింది, నమ్మించబడింది గనుక.

4) మానవ జీవనంలో విరక్తి మార్గం యొక్క పాత్ర ఏమిటి?

5) మానవ జీవనంలో, ప్రత్యేకించి సామాన్య జనానీకపు జీవన గమనంలో, విరక్తి అనే మాటకు -అంటే మేథో మహానుభావులు నమ్మి, ప్రవచించిన/ ప్రవచిస్తున్న అర్థం లోని విరక్తి అనే మాటకు-, విరక్తి మార్గానికి చోటు కూడ లేకుండా పోయింది. ఒక దానిని అనుభవిస్తూ పోగా, ఒకానొక దశలో దాని పట్ల కలిగే ఏహ్య భావన లేదా రోత భావన మాత్రమే విరక్తిగా చెప్పుకోబడుతోంది. దానికి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటూ, ఎప్పటికప్పుడు నూతన పోకడలకు మళ్ళడం వస్తుతః ఆనవాయితీ అయిపోయింది.

6) ప్రస్తుత మానవ జీవన స్రవంతిలో విరక్తి అనేది సాధారణ సామాన్య మానవులకు కాక, పైన చెప్పుకున్నట్లుగా ప్రత్యేక వర్గం వారికి మాత్రమే సంబంధించినదిగా, ఆధ్యాత్మికతను -సృష్టి లక్ష్యానికి విరుద్ధమే అయినప్పటికీ, యుగయుగాల ప్రవచనాల ప్రభావంతో నమ్మబడుతూ, నమ్మించబడుతూ వస్తున్న అర్థం లోని ఆధ్యాత్మికతను- ప్రబోధిస్తూ వస్తున్న వారికి మాత్రమే సంబంధించినదిగా అయిపోయింది.

7) "ఈ యోగంలో అనుసరించడానికి విరక్తి మార్గం అనేదే లేదు" అని మాస్టరు గారి డైరీలలో ఉన్న విషయం యొక్క అంతరార్థం ఏమిటి?

8) మాస్టరు గారి డైరీలలో 2-3-1919 న "స్వయానికి సూచన. జగ్గారావు గురించి" లిఖించబడిన విషయం "నీవు గృహస్థుగా ఉన్న యోగివి అని అతనికి చెప్పాలి. ఈ యోగంలో అనుసరించడానికి విరక్తి మార్గం అనేదే లేదు" అని.

9) పైన చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ మరొక్కసారి గుర్తు చేసుకోవలసిన అవసరం. ఏమిటి అంటే సామాజిక జీవనంలో ఒక గృహస్థుగా ఏయే జీవన కార్యకలాపాలకు మనిషి ఉద్యుక్తుడు అవుతున్నాడో, వాటిని కాదనుకుని దూరంగా ఉండిపోవడం లేదా పారిపోవడం అనేదే విరక్తి మార్గం అని చెప్పుకున్న మీదట, సృష్టి క్రమవికాసంలో మానవ సంబంధంగా ఏర్పరచబడిన జీవన విధానం నిరర్థకం అని పరోక్షంగా ఎలుగెత్తి చాటిన మానవ మేథస్సు, సృష్టి లక్ష్యాన్ని నఖశిఖ పర్యంతం తనలో అత్యంత గుంభనంగా ఇముడ్చుకుని ఉన్న ఆధ్యాత్మికత అనే పదానికి సృష్టి లక్ష్య విరుద్ధమైన అర్థాన్ని అంటగట్టి, అందుకు సరి అయినది విరక్తి మార్గం మాత్రమే అని ఎంతో తార్కికంగా, హేతుబద్ధంగా ప్రవచించి ప్రచారం చేసిన మానవ మేథస్సు నామమాత్రపు బుద్ధి జీవి మనిషిని అసలైన బుద్ధి జీవి మనిషిగా చేయడానికి వస్తుతః వ్యతిరేకం అని ఈ సందర్భంగా గుర్తించనగును.

10) ఈ యోగంలో అనుసరించడానికి విరక్తి మార్గం అనేదే లేదు అని అన్నపుడు, సాధారణ సామాజిక జీవనం లోనే మనిషికి సృష్టి లక్ష్యాన్ని అందుబాటు లోకి తీసుకువచ్చే సన్నద్థత, సమర్థత ఈ యోగంలో, యోగ విధానంలో ఉంది అనేది ఒక రకంగా ప్రత్యక్షంగా, సూటిగా లోతుల విషయంగా చెప్పబడింది అని గ్రహించనగును. దీనికి సమర్థింపుగా, మరికొంత విశ్లేషణగా మాస్టరు గారి డైరీలలో అదే రోజున (అంటే 2-3-1919 న) లిఖించబడి ఉన్న విషయం "జ్ఞాన మార్గం, తపో మార్గం, యోగ మార్గం (= ఇతర యోగాల మార్గం) వీటిలో భోగాలుగా (= అనుభవించబడకూడనివిగా) ఉదహరించబడిన వాటిని ఈ లైనులో యోగి కావడం ద్వారా అనుభవించవలసి ఉంటుంది" అని.