సమాధానం నెం.036 - ప్రశ్న నెం.036 (9-7-2021) విషయం "ఆచరణ, అబద్ధం".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.036 - ప్రశ్న నెం.036 (9-7-2021) విషయం "ఆచరణ, అబద్ధం".

Post by Katakam »

1) ఆచరణ అంటే ఏమిటి?

2) ముందుగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే సమాధానం నెం.034 విషయం "ఈ ప్రాక్టీసు యొక్క గొప్పతనం"
లో ప్రాక్టీసు అంటే ఆచరణ సాధ్య సాధన అని, ఆచరణ సాధ్యం కాకపోవడానికి సంబంధించి అబద్ధం అనే మాట గురించి ఉదాహరణ చెప్పుకున్న మీదట, ఆచరణ గురించి మరియు అబద్ధం అనే మాట గురించి ఇంకొంత వివరణ ఉంటే బాగుంటుంది అని అనిపించడమే ప్రస్తుత ప్రశ్నకు, సమాధానానికి ఆధారం.

3) ఆచరణ అంటే సామాజిక జీవనంలో లేదా ఆధ్యాత్మిక జీవనంలో ఉపయుక్తంగా వ్యవహరించడానికి దేహ వ్యవస్థకు అలవాటు అయేలా చరించడమే. దీనికి మహాత్ములు ఏర్చి కూర్చి చెప్పిన శాస్త్రాలు‌, నీతి సూత్రాలు, శతకాలు, మొదలైనవాటిని ప్రాతిపదికగా తీసుకోవడం పరిపాటి అయ్యింది. యుగయుగాల మానవ చరిత్ర చెప్పే సత్యం ఏమిటి అంటే విషయాలు గొప్పగా ఉన్నప్పటికీ, వాటి ఆచరణ సామాజిక/లౌకిక జీవనంలో సాధ్యం కావడం లేదు, పైపెచ్చు మనిషి నైతికంగా పతనం అవుతూ పోతున్నాడు అని. అందులో చెప్పుకోదగిన అత్యంత సాధారణ విషయ సంబంధ ఉదాహరణ అబద్ధం ఆడకుండడం.

4) అబద్ధమాడకుండడం ఎందుకు ఆచరణ సాధ్యం కావడం లేదు?

5) ప్రస్తుత సామాజిక జీవన సరళిలో అవతలి వారికి అబద్ధమని తెలియనంత చాకచక్యంగా అబద్ధమాడడం లౌకికానికి, లౌక్యానికి ప్రతీకగా ఉందని, అబద్ధమాడడంలోని ప్రావీణ్యం తెలివితేటలుగా పరిగణించబడుతోందని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. ఇది ప్రస్తుత సామాజిక పరిస్థితికి అద్దం పడుతుందనేది వాస్తవమే. కానీ, వస్తుతః అబద్ధమాడకుండడం ఎందుకు ఆచరణ సాధ్యం కావడం లేదు అనేది తదుపరి ప్రశ్నలో చెప్పుకోనవుతుంది.

6) అసలు అబద్ధం అంటే ఏమిటి?

7) అబద్ధమాడరాదు అనే నీతిసూత్రం ప్రచారం మాత్రమే అయింది తప్ప ఈ మధ్య కాలం వరకు అబద్ధం అంటే ఏమిటో విషయంగా కూడ బయటపడనే లేదు. ఒక మహానుభావుడు చెప్పినట్లుగా, అబద్ధమాడరాదు అనే వ్యతిరేక క్రియను చెప్పడం కాకుండా అందుకు ఏం చేయాలి అనే అనుకూల క్రియను చెప్పనంతవరకు అబద్ధమాడకుండడం ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. నిజం చెప్పకపోవడమే అబద్ధం అనేది మాత్రమే అందరికీ కేవలం భావంగా తెలిసిన విషయం. నిజం చెప్పకపోవడం అనేది కూడ వ్యతిరేక క్రియా సంబంధమే కదా.

8) అబద్ధం అంటే న + బద్ధం, అంటే బద్ధము కానిది, అంటే బంధించబడనిది. ఏది బంధించబడనిది, దేనికి బంధించబడనిది అనేదే తెలియవలసిన అసలు విషయం. జీవించడంలో మనిషికి ఉన్న మూడే మూడు సాధనాలు ఆలోచన, మాట, చేత. మనసు చేసే ఆలోచన, మాట్లాడే మాట, చేసే చేత. వీటినే త్రికరణాలు అన్నారు. అంటే మనిషికి ఉన్న మూడు కరణాలు లేదా సాధనాలు అని. ఆ మూడిటిలో ప్రతి ఒక్కటీ మిగతా రెండిటికీ బంధింపబడి ఉంటే అది బద్ధం. అంటే మనసు చేసే ఆలోచనయే మాటగా రావాలి, చేతగా చేయబడాలి; మాట్లాడే మాటయే ఆలోచనగా రావాలి, చేతగా చేయబడాలి; చేసే చేతయే ఆలోచనగా రావాలి‌, మాటగా మాట్లాడబడాలి. అలా ఉంటే బద్ధం, బంధింపబడి ఉండడం. అలా ఉండకపోతే, అది అబద్ధం, బద్ధం కానిది. అంటే ఆలోచనకు మాట భిన్నమైనా, చేత భిన్నమైనా లేదా మాటకు ఆలోచన భిన్నమైనా, చేత భిన్నమైనా లేదా చేతకు ఆలోచన భిన్నమైనా, మాట భిన్నమైనా, అది బంధింపబడకుండడం, బద్ధం కాకుండడం, అదే అబద్ధం. ఇది విషయంగా తెలిస్తే, ఆచరణ సాధ్యమవుతుంది.
Post Reply