1) ప్రస్తుత సృష్టి విధానం అంటే ఏమిటి?
2) ప్రస్తుత సృష్టి ఏ పద్ధతిలో నడుస్తోందో, దానిని ప్రస్తుత సృష్టి విధానం అని చెప్పుకోనవుతుంది. సృష్టి నడవడం అంటే సృష్టి లోని విభిన్న దశల జీవులు, అందులో ముఖ్యంగా బుద్ధి జీవి అయిన మనిషి, ఉంటున్న తీరు మొత్తాన్ని సమిష్టిగా సృష్టి నడవడం అని చెప్పుకోనవుతుంది. ఉంటున్న తీరు అంటే సాధారణ రీతిలో ఏ లక్షణాలు మనిషిలో పని చేస్తున్నాయో, మనిషిని శాసిస్తున్నాయో, వాటి తీరు అని, అంతేకాక తోటి మనుషుల పట్ల వస్తుతః మనిషి ఎలా ఉంటున్నాడో ఆ తీరు అని. మనుషుల సమిష్టి వర్తనాన్నే సృష్టి విధానం అని చెప్పుకోనవుతుంది. దీనిని రెండు భాగాలుగా విభజించనవుతుంది - ఒకటి సామాజికం, రెండవది ఆధ్యాత్మికం.
3) ప్రస్తుత సృష్టి విధానానికి, ఈ యోగ విధానానికి ఉన్న సంబంధం ఏమిటి?
4) వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పుకోవడం కంటె ఘుందుగా, ఈ యోగ విధానం ఏమిటి అనే దాని గురించి క్లుప్తంగా తెలియవలసిన విషయం. సృష్టి లక్ష్య దిశగా మనిషిని పయనింప చేయడానికి ప్రస్తుత స్థితి గతులను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత అస్తవ్యస్త స్థితి నుండి బయటపడేలా చక్కదిద్ధి, లక్ష్యానికి చేరువ అయ్యేలా చేయడానికి సంకల్పించిందే ఈ యోగ విధానం. సృష్టి లక్ష్యం ఏమిటి అనేదే తెలియని మనిషికి సృష్టి లక్ష్యం ఏమిటో తెలిసేలా చేసి, అలా తెలియచేయడానికి మరియు ఆ లక్ష్యం వైపుకు పయనింప చేయడానికి చేపట్టబడిన క్రియల, ప్రక్రియల, ప్రయోగాల సారమే ఈ యోగ విధానం.
5) ప్రస్తుత సృష్టి విధానం -అంటే మనిషి యొక్క బాహ్య, ఆంతరిక వర్తనం, వాటన్నిటి సమిష్టి అయిన విశ్వ వర్తనం లేదా సృష్టి వర్తనం- మనిషి యొక్క సామాజిక, ఆధ్యాత్మిక ఉనికిని శాసిస్తోంది. మనిషికి వస్తుతః తన గురించి లేదా తన నేను గురించి పట్టించుకోవడానికి కూడ వీలు కలుగచేయనిది ప్రస్తుత సృష్టి విధానం. దీనిని అందని లోతుల అన్వయంతో చెప్పుకోవాలి అంటే మనిషి ప్రస్తుతం అస్వతంత్రుడుగా -తాను ఏమిటో లేదా తన నేను ఏమిటో తెలియక, తాను తానుగా ఉండలేకపోవడాన్ని మించి తాను తానుగా ఉండవలసిన అవసరం ఉంది అని కూడ తెలియని అస్వతంత్రుడుగా- ఉంటున్నాడు. స్వతంత్రత లేదా ఇండిపెండెన్సీ అంటే ఏమిటో కనీసంగా కూడ తెలియని మనిషికి స్వతంత్రత అంటే ఏమిటో తెలిసేలా చేసి, ఆ స్వతంత్రతను సిద్ధింపచేయడానికి సమకట్టిందే ఈ యోగ విధానం.
6) ప్రస్తుత సృష్టి విధానం గురించి, దాని లోతుల గురించి ఒక రకంగా ప్రాథమిక విషయాలే తెలియని మనిషికి, ప్రస్తుత సృష్టి విధానపు లోతులను మించిన లోతులలో జరుగుతూ, ప్రస్తుత సృష్టి విధాన రీతులకు పూర్తి భిన్నంగా జరిగే క్రియల, ప్రక్రియల, ప్రయోగాల ఈ యోగ విధానం గురించి మనిషికి, ప్రత్యేకించి ఈ యోగ ప్రాక్టీసు చేసే యోగ సాధకులకు సైతం తెలియకపోవడం వింత ఏమీ కాదు.
7) ప్రస్తుత సృష్టి విధానం దిగజారిపోయింది అని అనడానికి ఆధారాలు ఏమిటి?
8) సామాజిక స్రవంతిలో -అంటే తోటి వ్యక్తులతో పరస్పర సంబంధంగా తన వ్యక్తిగత, కుటుంబీక, సామాజిక, ఆధ్యాత్మిక జీవనం గడపడంలో- మనిషి తన ఉనికిని కోల్పోకుండా, ఇతరుల ఉనికికి భంగం కలుగచేయకుండా వర్తించడమే నీతి, రీతి. దానికి ఏమాత్రం భిన్నంగా ఉన్నా, అది దిగజారుడుతనానికి ప్రతీకయే అవుతుంది. దానికి వ్యక్తిగత లక్షణాలను ఎన్నిటిని అయినా పేర్కొనవచ్చు. కానీ, ప్రాపంచికంగా సర్వత్రా జరుగుతున్న వాటిని సమీకరించి చెప్పుకోవాలి అంటే రకరకాల అంశాల ఆధారంగా ఒక ప్రక్క ఆధిక్యతా భావన, దానికి ప్రతిగా న్యూనతా భావన, ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే మనుషులలో గొప్ప చిన్న లేదా ఎక్కువ తక్కువ తేడా; ఒక ప్రక్క తన స్వార్థం కోసం తోటి వారిని వాడుకోవడం, ఇంకొక ప్రక్క నిస్సహాయంగా వాడుకోబడడం; ఒక ప్రక్క ఇతరులను తన కలిమితో, బలిమితో శాసించడం, ఇంకొక ప్రక్క నిర్వీర్యంగా, నిర్జీవంగా శాసించబడడం; వాటికి అనుబంధమైన అవినీతి, దుర్మార్గం, దౌర్జన్యం, వగైరా; ప్రస్తుత సృష్టి విధానంలో ఉన్న వీటి స్థితి గతి సదరు విధానం దిగజారిపోయింది అని అనడానికి ఒప్పుకోదగిన ఆధారాలే కదా.
సమాధానం నెం.079 - ప్రశ్న నెం.079 (3-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, ఈ యోగ విధానం".
-
Katakam
- Posts: 3864
- Joined: Sun May 09, 2021 6:18 pm