వస్తుతః యోగం అంటే ఏమిటి?
వస్తుతః యోగం అంటే కలయిక. ఏమిటి ఆ కలయిక, వేటి కలయిక అని సహజంగా కలిగే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం అవసరమే కదా. జీవాత్మ పరమాత్మల కలయిక అనేది యుగయుగాలుగా సాంప్రదాయబద్ధంగా చెప్పబడుతూ వస్తున్న సమాధానం. దానికి ఇవ్వబడిన వివరణ ఏమిటి అంటే జన్మ తీసుకున్న తరువాత మనిషి దైవ/పవిత్ర కార్యక్రమాల ద్వారా పుణ్యం
గడించుకుని దేముడిలో/భగవంతుడిలో ఐక్యం అయిపోవడం అని, అదే మోక్షం అని. కానీ, ఇది అసంబద్ధం అని తదుపరి ప్రశ్నల సమధానాలలో యోగ సంబంధంగా చెప్పుకోబడుతుంది.
జంట పదాలయిన యోగం క్షేమం (అంటే ఒకానొక అర్థంలో కలిసిరావడం, కలిసివచ్చింది భద్రంగా ఉండడం) అనేవాటిలోని యోగం అనే మాటకు, సాధకులుగా మనం ప్రాక్టీసు చేస్తున్న యోగం అనే మాటకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?
ఏ సంబంధమూ లేదు. కానీ, యోగ సాధకులలో అధికులకు తెలిసి గానీ తెలియని లోతులలో గానీ కలిసిరావడం అనే భావన ఉండడం వాస్తవదూరం కాదని అనిపిస్తుంది.
మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న కర్మ యోగం, జ్ఞాన యోగం, రాజ యోగం, భక్తి యోగం, సాంఖ్య యోగం వగైరా వాటిలోని యోగం అనే మాటకు, మనం ప్రాక్టీసు చేసే యోగం అనే మాటకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?
ఇతర సాంప్రదాయ విధానాలలో వాడబడిన యోగం అనే మాటకు, మనం ప్రాక్టీసు చేసే యోగం అనే మాటకు మాటపరంగా మాత్రమే సంబంధం ఉంది, అర్థంపరంగా కాదు. పైన చెప్పుకున్న యోగాన్ని/కలయికను/మోక్షాన్ని సాధించడానికి వివిధ రకాల మార్గాలను చెప్పినవే ఈ సాంప్రదాయ విధానాలు. మోక్షం అనే మాటకు ఉన్న అర్థంలోనే తేడా ఉంది గనుక, ఇతర విధానాలలోని యోగం అనే మాటకు, మనం ప్రాక్టీసు చేసే యోగం అనే మాటకు సంబంధం ఉంది అని చెప్పడానికి వీల్లేదు.
సాంప్రదాయబద్ధంగా వాడే ఆధ్యాత్మికత (ఆది + ఆత్మ + ఏకత) అనే మాటలోని పదభాగమైన ఏకత అనే మాటకు, మనం ప్రాక్టీసు చేసే యోగం అనే మాటకు ఏమయినా సంబంధం ఉందా? ఉంటే, అది ఏమిటి?
ఇక్కడ కూడ పై సమాధానమే వర్తిస్తుంది, ఎందుకు అంటే పదభాగమైన ఏకత అనే మాటకు గానీ లేదా మొత్తంగా ఆధ్యాత్మికత అనే మాటకు గానీ ఇతర విధానాలలో చెప్పిన అర్థం, మన యోగంలో వాటికి చెప్పుకోదగిన అర్థం ఒకటి కాదు గనుక.
పైన చెప్పిన ఇతరమైన పదాలలోని యోగం అనే మాటకు భిన్నంగా మనం ప్రాక్టీసు చేసే యోగం అనే మాటకు వేరే అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
ఉంది. మనం చెప్పుకోవలసిన విషయం కూడ అదే.
కాకపోతే, ఇతర విధానాలలో యోగంగా/కలయికగా/మోక్షంగా పరిగణించబడే జన్మరాహిత్యం (పునర్జన్మ లేకుండా పోవడం), విదేహ ముక్తి (దేహం లేకుండా పోయిన తరువాత మాత్రమే పొందబడే ముక్తి, అందుకుగాను దైవ/పవిత్ర కార్యాల ద్వారా పుణ్యం మూటకట్టుకోవడం), దేముడిలో/భగవంతుడిలో ఐక్యం కావడం, దేముడిలో/భగవంతుడిలో ఐక్యమయే అర్హతకు క్రింది స్థాయిదిగా ఆర్జించిన పుణ్యం వలన పరలోకంలో దేవకాంతల పొందు అనే స్వర్గసుఖాలు అనుభవించడం అనేవి ఎందుకు అసంబద్ధమో కొంత వివరంగా తెలుసుకోవలసిన అవసరం.
జన్మరాహిత్యం, విదేహ ముక్తి - జన్మతో ఆరంభమై మరణంతో ముగియడమే జన్మరాహిత్యం అని అన్నపుడు, జన్మతో ఆరంభమైన సృష్టిలో జన్మకంటూ తప్పకుండా ఒక పరమార్థం ఉండి ఉండాలి. అది మరణం మాత్రం కాదు. ఎందుకు అంటే స్థూలంగా జన్మకు వచ్చిన తరువాత సూక్ష్మ స్థితిలోకి తిరిగి వెనక్కి వెళ్ళి కలిసిపోవడం అనే విదేహ ముక్తియే లక్ష్యం అయితే, సూక్ష్మ స్థితి నుండి అసలు జన్మకే రాకుండా ఉంటే సరిపోయేది కదా. అది మన చేతిలో లేదు కదా అంటే, సృష్టి చేసిన సృష్టికర్త గానీ, సృష్టికి మూలమైన భగవత్తత్త్వం గానీ సృష్టితో సరదాగా ఆడుకుంటున్నారు అనే మనిషి మాట మూర్ఖత్వం కాక మరేమీ కాదు. సృష్టికి ఉన్న లక్ష్యం తెలియజాలక ఏదో ఒకటి చెప్పడం మూర్ఖత్వం కాక మరేమవుతుంది.
దేముడిలో/భగవంతుడిలో ఐక్యం కావడం - ఇది అసలు సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమై, దాని గురించి లోతుగా అధ్యయనం చేయడం సాధ్యం కానంతవరకు, మోక్షానికి ఉన్న సాంప్రదాయ అర్థం వినడానికి బాగానే కొనసాగుతూ ఉంటుంది. ప్రతి మనిషిలోను దివ్యత్వం/దైవత్వం/భగవత్తత్త్వం ఉంది అన్నప్పుడు, అందరూ దేముడిలో/భగవంతుడిలో ఐక్యమై సృష్టి సమసిపోతే, సృష్టికి అసలు అవసరం ఏమిటి. కోట్ల కోట్ల సంవత్సరాలుగా సృష్టి లయ విలయ ప్రళయాలతో అంతమై మరల సృష్టి జరుగుతోంది అన్నపుడు, పునఃసృష్టి అవసరం ఏమిటి, సృష్టి లక్ష్యం ఈరోజుకు కూడ మానవ మేథస్సుకు అందలేదు అనే వాస్తవం మాత్రమే అవుతుంది. భగవంతుడు మనిషి లాంటి బుద్ధిహీనుడు అని చెప్పడం మానవ మేథస్సు యొక్క అంతులేని అహానికి నిదర్శనం మాత్రమే.
స్వర్గసుఖాలు - ఇది సాధారణ మనిషికి మేథావులు పెట్టిన ఆశ మాత్రమే. సుఖానికి స్థూలం అవసరం, పరలోకాలలో స్థూలాలు ఉండవనే ఇంగితం కూడ మానవ మేథస్సుకు లేదా, కాదంటే ఈ వాస్తవం తెలిసి కూడ సామాన్య జనానీకాన్ని మభ్యపెట్టడంలో మేథో మహానుభావుల ఆంతర్యం ఏమిటి అనేది శోధించబడి బయట పెట్టబడనంతవరకు ఆశ చావదు. స్వర్గసుఖాలు మగవాళ్ళకేనా ఆడవాళ్ళకు ఉండవా అనే విషయం గురించి మేథావులు ఎందుకు చెప్పలేదు. స్వర్గసుఖాలు అనే మాట అసంబద్ధం.
ఇపుడిక మనం ప్రాక్టీసు చేసే యోగం సంబంధంగా చెప్పుకోవలసిన విషయం గురించి.
ఈ సందర్భంగా 14-11-1912 న మాస్టరుగారి డైరీలో వేయబడిన "మోక్షం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి" మరియు"ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి" అనే ప్రశ్నలను ఉదహరించుకోవడం ఎంతయినా అవసరం. సాంప్రదాయబద్ధమైన మాటగా పరిగణించబడే మోక్షం అనే మాటలో గానీ, వేరే ప్రశ్నలోని "భూమి మీద జన్మించడం" అనే మాటలో గానీ యోగపరంగా నిగూఢమైన అర్థాలు ఇమిడి ఉంటాయని కనీసం చూచాయగానయినా అనిపించే విషయమే.
యోగం, కలయిక, మోక్షం, పదభాగమైన ఏకత, మొత్తం మాట అయిన ఆధ్యాత్మికత - ఈ మాటలలోని లోతుల అసలైన అర్థమే యోగ సంబంధం.
యోగం, కలయిక, ఏకత - ఈ మూడిటికీ ఒకటే అర్థం. ఆ అర్థమే ఆధ్యాత్మికత (ఆది + ఆత్మ + ఏకత) అనే మాటలో ఇమిడి ఉంది.
ఆది అంటే మూలం. మూలం అంటే మొట్టమొదటి ఉనికి. మొట్టమొదటి ఉనికి అంటే సృష్టిపరంగా ప్రాణం లేదా మూలప్రాణం, అదే సృష్టికి మూలమైన భగవత్తత్త్వం. మొట్టమొదటి ఉనికి అంటే వ్యక్తిపరంగా ప్రథమ జన్మ కంటె ముందు ఏర్పడిన వ్యక్తిగత ప్రాణ ఉనికి.
ఆత్మ అంటే ఆ వ్యక్తిగత ప్రాణ ఉనికి యొక్క అంశగా వ్యక్తిలో ఉన్న ప్రాణం అని చెప్పబడే ప్రాణతరంగం లేదా వ్యక్తి స్థాయి భగవత్తత్త్వం/దైవత్వం. ప్రాణతరంగం ఒక జన్మకే పరిమితం. మరణానంతరం అది ప్రాణ ఉనికిలో కలిసిపోతుంది. ఇంకొక జన్మకు ఇంకొక ప్రాణతరంగం వస్తుంది. పూర్తి స్థాయి ప్రాణ ఉనికి స్థూలం లోకి రావడానికి జరగవలసిన ప్రక్రియయే స్థూలం తయారుకావడం. అది సృష్టి స్థాయి ప్రక్రియగా మూల స్థాయిల నుంచి జరగవలసిన అవసరం. ఈ స్థాయిలనే మన యోగంలో నిల్ లెవెల్సు అన్నారు. ఈ నిల్ లెవెల్సుకు, మన యోగంలో మాత్రమే ఉపయోగించబడిన నిల్ స్టేట్స్ లేదా శూన్య స్థితులు అనే పదజాలానికి సంబంధం ఉంది.
మనిషిలో ఉన్న దైవత్వం/భగవత్తత్త్వం అంటే పూర్తి స్థాయి ప్రాణ ఉనికి అయిన ప్రాణమే అనే విషయం సృష్టి మనిషికి తెలియకపోవడమే భ్రమింపచేయబడడం. ఆ ఏకమే ప్రాణ ఉనికి. అలా భ్రమింపచేస్తున్నదే ఆ భ్రమింపచేసే ఏకం. "పూర్తి ప్రజ్ఞతో ఆ భ్రమింపచేస్తున్నదానిని చేరడం/చేరుకోవడం" అనే ఆరవ ఒప్పందంలో ఇమిడి ఉన్న అర్థం ఇదే.
మోక్షం - మః + అక్షం. అక్షం అంటే ఆధారం. ఆధారం లేకుండా పోవడమే మోక్షం. జననమరణ పరంపర అంటే పుట్టడం, మరణించడం, మరల పుట్టడం, మరల మరణించడం, ఇలా. ఇదే ఈ పరంపర. ఈ పరంపరకు ఆధారం లేకుండా పోవడమే మోక్షం. "మృత్యోర్మా అమృతం గమయ" (మృత్యువు నుండి అమృతత్వం వైపుకు మమ్ములను నడిపించవలసినది) అనే అభ్యర్థనాపూర్వక వేదసూక్తం ఒక రకంగా దీనికి సంబంధించిందే.
సమాధానం నెం.004 - ప్రశ్న నెం.4 (6-5-2021) విషయం " యోగం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm