1) "తోకచుక్క గురించి. ట్రిపుల్ నుంచి శక్తి సేకరణతో మాంగీ రూట్ మరియు సింబల్ లైట్స్ గుండా పయనిస్తూ తోకచుక్క భూమిని చుట్టి వెళుతుంది" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, దీని ముందరి ప్రశ్న విషయానికి (ప్రశ్న, సమాధానం నెం.651 విషయం "యోగా రికార్డుల విషయాలు - బాహ్యానికి వికీర్ణం చెందడం") గానీ, అదే రోజున -20-6-1921 న- వ్రాయబడిన మిగతా విషయాలకు గానీ ఎలాంటి సంబంధం లేకుండా హటాత్తుగా "తోకచుక్క గురించి" అనే ప్రస్తుత ప్రశ్న విషయం వ్రాయడంలో లోతులకు సంబంధించిన ఏవయినా విషయాలు ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే, అవును ఉన్నాయి అనేది సమాధానం. ఎలా అనే దానికి కొంత వివరణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే తోకచుక్క ప్రక్రియ వికీర్ణం అనే దానికి సంబంధించింది. వివరంగా చెప్పుకుంటే, విశ్వాంతరాళాల నుంచి సేకరించిన శక్తిని తోకచుక్క భూమికి అందించి లేదా వికీర్ణం చెందించి వెళుతుంది అనేది. దీని దృష్ట్యా లేదా ఈ సామ్యం దృష్ట్యా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయానికి (ప్రశ్న, సమాధానం నెం.651 కి) సంబంధించి ఉంది అని తెలియనగును. ఇక ప్రస్తుత ప్రశ్న విషయం లోకి.
3) తోకచుక్క గురించి. మాటగా మాత్రమే తెలిసిన తోకచుక్క గురించి తెలియవలసిన అసలు తోకచుక్క అంటే ఏమిటి అనేది. చుక్క అంటే నక్షత్రం. తోకచుక్కతో కూడి ఉన్న నక్షత్రమే తోకచుక్క. నక్షత్రాలు పంచ త్రికోణ ఆకారంలో ఉంటాయి కదా, తోక ఉండడం అంటే ఏమిటి అనేది ప్రశ్న. నక్షత్రానికి లేదా చుక్కకు తోక ఉండదు. సృష్టికి, వైజ్ఞానిక శాస్త్రానికి అందని విధంగా -ఎందుకు అంటే వైజ్ఞానిక శాస్త్రానికి ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనే వివరాలు మాత్రమే తప్ప, ఎందుకు అనేది ఏ శాస్త్రాల పరిధి లోని విషయం కాదు గనుక, మానవ సంబంధంగా ఉన్న సర్వ శాస్త్రాలు, సర్వ రీతుల శాస్త్రాలు మనిషిలో పరిఢవిల్లిన మేథస్సుకు మాత్రమే సంబంధించినవి గనుక, ఎందుకు అనేది వస్తుతః నడుస్తున్న ప్రస్తుత సృష్టి విధానానికి అతీతంగా సృష్టి విధానానికి లేదా మూల స్థాయి సృష్టి విధానానికి సంబంధించింది గనుక. అందుచేతనే, అప్పటి వరకు బయటపడనివి బయటపడినా లేదా బయటపడకపోయినా, అవి అన్నీ సృష్టి రసస్యాలే లేదా అంతుపట్టని అద్భుతాలే.
4) ట్రిపుల్ నుంచి శక్తి సేకరణతో. ట్రిపుల్ అంటే మాటగా త్రయం లేదా మూడిటి సమూహం. దీనికి వ్రాత పూర్వకంగా సీనియరు యోగ సాధకులు చెప్పింది త్రిమూర్తులు అని. కానీ, మాస్టరు గారి డైరీలలో త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు గురించి యోగ విషయాలలో చర్చించకూడదు అని, అలా చేస్తే బహిష్కరించబడతారు అని ఉంది. మరి ట్రిపుల్ అంటే ఏమిటి అనేది స్పష్టంగా తెలియవలసిన అవసరమే. పరమాణువుల సంబంధంగా చెప్పుకుంటే, యమ్. కోర్సు వివరణలో చెప్పిన ప. పరమాణువు, ర. పరమాణువు, మ. పరమాణువు లేదా విజ్ఞాన శాస్త్ర సంబంధంగా ప్రొటాన్ (పాజిటివ్), ఎలక్ట్రాన్ (నెగెటివ్), న్యూట్రాన్ (రెండిటినీ సమతుల్యం చేసేది) అని, అదే ట్రిపుల్ లేదా త్రైగుణ్యం అని చెప్పుకోనవుతుంది. కానీ ఇక్కడ చెప్పుకుంటున్న ట్రిపుల్ లేదా త్రయం వాటికి భిన్నమైనది, ఖగోళానికి, ఖగోళానికి అతీతమైన స్థాయిలకు సంబంధించింది. కాకపోతే, ఆ మూడు ఏమిటి అంటే విశ్వానికి వెలుపల ఉన్న విశ్వాంతరాళాలకు సంబంధించిన స్థాయిలు అని, అవి త్రైగుణ్యానికి అనుగుణంగా ఉన్నటువంటి విశ్వాతీత స్థాయిలు అని మాత్రమే చెప్పుకోనవుతుంది. శక్తి సేకరణతో. శక్తిని సేకరించుకుంటూ. ఆ సేకరించుకునే శక్తియే నక్షత్రానికి లేదా చుక్కకు తోకగా రూపొందుతుంది అని తెలియనగును.
5) మాంగీ రూట్ మరియు సింబల్ లైట్స్ గుండా పయనిస్తూ. మాంగీ రూట్ మరియు సింబల్ లైట్స్ విశ్వానికి అతీతమైన స్థాయిలు లేదా ప్రాంతాలు అని తెలియనగును. మాంగీ రూట్‌గా లేదా మాంగీ పథంగా ఇక్కడ చెప్పబడిన దాని లోతుల అర్థం బయటపడే విధంగా యమ్. కోర్సు నోట్సులో దీనిని మ్యాంగీ రూట్ లేదా మ్యాంగీ పథం అని వాడబడింది. దానికి తెలుగు పదంగా 'నృచోదయ పథం' అని చెప్పుకోనవుతుంది, గాయత్రీ మంత్రం లోని 'ప్రచోదయాత్' అనే పద ప్రయోగానికి అనుగుణంగా. అంటే అర్థంగా చెప్పుకుంటే, నరుని/ మనిషి వైపుకు పయనించేది అని. ఇది సాంకేతిక పదజాలం లాగ అనిపించినా, విషయం ఇంతే. సృష్టి ప్రక్రియ లోతులకు వెళ్ళి చెప్పుకోవాలి అంటే మనిషి యొక్క సృష్టి లక్ష్య సంబంధమైన డెవలప్మెంటు కోసమే సృష్టి ప్రక్రియలు సమస్తమూ అని, అందులో భాగమే తోకచుక్క పయనం అని తెలియనగును. సింబల్ లైట్స్. తెలుగు మాటగా చిహ్న కాంతులు. ఇది విశ్వానికి అతీతమైన ఒక ప్రాంతం. కాంతి అనేది నక్షత్రాలుగా రూపుదిద్దుకోవడం కంటె ముందుగా ఉన్న స్థాయి లేదా స్థితి. వాటి గుండా పయనిస్తూ.
6) తోకచుక్క. అత్యంత శక్తివంతమైన కాంతి పుంజాలే చుక్కలు లేదా నక్షత్రాలు. చుక్క అంటే బిందువు కదా, నక్షత్రాలు పంచ త్రికోణ ఆకారంలో కనుపిస్తాయి కదా, ఏమిటి ఈ వైరుధ్యం అనేది అవసరమైన ప్రశ్నయే. మనకు కనుపించే పంచ త్రికోణ రూపం వస్తుతః నక్షత్రానిది కాదు అని, బిందు రూపంగా ఉండే నక్షత్రం యొక్క కాంతి ప్రసరణయే అని తెలియనగును. పంచ త్రికోణాల మర్మం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, అది శూన్య స్థితుల ప్రక్రియకు సంబంధించి ఏర్పడిన రూపం అని తెలియనవుతుంది. వివరణ ప్రస్తుత అవసరం కాదు.
7) భూమిని చుట్టి వెళుతుంది. క్లుప్తంగా చెప్పబడిన ఈ మాటలకు కొంత వివరంగా చెప్పుకోవలసిన అవసరం. ఏమిటి అంటే. ముందుగా, విధాన పరంగా తోకచుక్కలు రావడం ఏమిటి, ఎందుకు వస్తాయి అని. భూమి, భూమి మీది మానవ జీవనమే సృష్టి లక్ష్యానికి, సృష్టి లక్ష్యం నెరవేరడానికి స్థానం. సృష్టి లక్ష్యం యొక్క మొదటి అంకంలో భాగంగా సృష్టి, మనిషి దిగజారిపోవడంలో మానవ మనుగడ సాగడానికి సృష్టికి కారణమైన మూల స్థితులు, స్థాయిల ఏర్పాట్లలో భాగమే తోకచుక్కలు విశ్వాంతరాళాల నుంచి శక్తిని సేకరించి తిరుగు ప్రయాణంలో భూమికి, భూమి మీది మనిషికి శక్తిని అందించడం. భూమికి, భూమి మీది మనిషికి ఆంతరికంగా శక్తి ఎప్పుడు సన్నగిల్లుతుంది అనేది తోకచుక్కలకు ఎలా తెలుస్తుంది అనే దాని వెనుక ఏదో జరుగుతోంది అనేది సృష్టి స్థాయిలకు, సృష్టికి అతీతమైన స్థాయిలకు అందని, అందజాలని, అందకూడని, కానీ యోగ పరంగా ఎంతో గుంభనంగా మాత్రమే బయటపెట్టబడిన శూన్య స్థితుల వాస్తవం, రహస్యం. ఇదే కాదు, ఇలాంటివి యోగా రికార్డులలో అనేకానేకం. అర్థం కావడం, అర్థం చేసుకోవడం అనేవి మేథస్సుకు కేవలం అసంభవం.
8) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
9) అందిన విషయాలకు లిఖిత రూపం ఇవ్వడం మాత్రమే జరుగుతోంది. అర్థం అయినా కాకపోయినా, ఈ విషయాలను చదవడానికి కూడ ఒక ప్రత్యేక అర్హత ఉండవలసిన అవసరం అని తెలియనగును.
సమాధానం నెం.652 - ప్రశ్న నెం.652 (22-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - తోకచుక్క పయనం".
-
Katakam
- Posts: 3862
- Joined: Sun May 09, 2021 6:18 pm