'ఎక్కడ చూసినా, ఏదో కలిసిరావాలని లేదా ఆరోగ్యం బాగుపడాలని లేదా కోరికలు తీరాలని యోగా ప్రాక్టీసు చేయడం జరుగుతోంది తప్ప' అనేదాని గురించి.
దీనికి సంబంధించి, మాస్టరు గారి డైరీలో 21-10-1912 న మీడియములకు చేయబడిన సూచనలు తెలుసుకోదగినవి - "కొంతమంది మీడియములు ఫిజికల్ అసిస్టుమెంటు కోసం కొన్ని కోర్సులు చేశారు. ఈ లైను ద్వారా పొందదగింది ఫిజికల్ అసిస్టుమెంటేననే ఆలోచనతోనే వాళ్ళు ప్రాక్టీసు చేస్తూ పోతున్నారు. దీనివలన వాళ్ళకు మానసిక వైకల్యం కలుగుతోంది. ఫిజికల్ అసిస్టుమెంటు కోసం ఈ లైను ప్రాక్టీసును ఉపయోగించకూడదు" - అని. అప్పట్లో ఆ మీడియములు చేసిందే ఇప్పుడు ప్రస్తుత యోగ సాధక సమాజంలో అధికులు లేదా దాదాపు అందరూ కూడ చేస్తున్నారని అనిపిస్తుంది. ఫిజికల్ అసిస్టుమెంటు అంటే ఏమిటో కొంత వివరంగా చెప్పుకుంటే తప్ప విషయం స్పష్టం కాదు. భౌతికానికి లేదా లౌకికానికి సహాయకారిగా యోగా ప్రాక్టీసును వాడకూడదు అనేది దీని అర్థం. భౌతికానికి లేదా లౌకికానికి అంటే మనిషికి సహజంగా ఉండే కోరికలు సమస్తం అనే అర్థమే వస్తుంది. జీవితం ప్రశాంతంగా సాగిపోవడం, అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరడం, ఆరోగ్యం బాగుండడం, ఆర్థికంగా బాగుపడడం, మనసు ప్రశాంతంగా ఉండడం, సమయం సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన కోరికలు కోరుకోవడం, వగైరా వగైరాలు అన్నీ భౌతికానికి లేదా లౌకికానికి సంబంధించినవే.
డైరీలో 24-11-1912 న వేసిన ఏడు ప్రశ్నలలోని "భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎలా మెలగాలో మీరు నిశ్చయించుకోవాలి" మరియు "భౌతిక రంగానికీ, ఆధ్యాత్మిక రంగానికీ మధ్యన ఉన్న తేడాను మీరు తెలుసుకోవాలి" అనే రెండు ప్రశ్నలు "భౌతికానికి సహాయకారిగా యోగా ప్రాక్టీసును వాడకూడదు" లోని భౌతికానికి సంబంధించినవే.
యోగా ప్రాక్టీసు ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేస్తున్నామా అనేది ప్రశ్నించుకోదగినది మాత్రమే కాక కాదనలేని వాస్తవం కూడ కాదా?
కాదనలేని వాస్తవమే. కానీ యోగానికి సంబంధించిన ఇలాంటి లోతుల గురించి మాట్లాడుకోవడం కాక యోగా ప్రాక్టీసుకు సంబంధించిన గొప్ప అనుభూతులను యోగం అని భావించడమే సర్వత్రా జరుగుతోంది అనే వాస్తవాన్ని కాదనగలమా. గొప్పగా కలిగే అనుభూతుల మర్మం ఏమిటో యోగపరంగా తెలుసుకోవలసిన అవసరం కాదా.
అప్పటి మీడియములను ఉద్దేశించి 14-11-1912 న డైరీలో వేయబడిన "ఈ యోగా ప్రాక్టీసు దేనికోసం ఉద్దేశించబడిందో మీరు నిశ్చయంగా తెలుసుకోవాలి" అనే ప్రశ్న ప్రస్తుత యోగ సాధక సమాజానికి వర్తించదా?
వర్తిస్తుంది, యోగా ప్రాక్టీసు చేసే ప్రతి ఒక్క యోగ సాధకునికి వర్తిస్తుంది. అప్పటి మీడియములకు ఆ ప్రశ్న వేయవలసిన అవసరం వచ్చి ఉండింది అంటే దాని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్క యోగ సాధకుడు గుర్తించవలసిన అవసరం, అందునిమిత్తం నిజాయితీగా ప్రయత్నం చేయవలసిన అవసరం.
ఏమీ తెలియడం లేదు అనే ఆంతరిక తపనను మించి, అలా తెలుసుకోవడానికి నిజాయితీతో కూడిన ప్రయత్నం జరుగుతోందా?
యోగా ప్రాక్టీసులో అనుభూతులు కలిగిన వాళ్ళు వాటిని యోగ ఫలితంగా తీసుకుని ఎంతో కొంత సంతోషించడం లేదా ఆనందించడం జరుగుతోంది అనేది వాస్తవం. ఎలాంటి అనుభూతులు లేకుండా యోగా ప్రాక్టీసు చేసుకుంటూ పోతున్నవారికి ఏమీ తెలియడం లేదు అని అనుకోవడంలో ఎంతటి ఆంతరిక తపన ఉంటుందో ఊహించడం అసాధ్యం కాదు. ఇది ప్రస్తుత యోగ సాధక సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితి అని కాదనగలమా. ఎవరికి వాళ్ళు తమకు తెలిసిన విధానంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనేది కూడ వాస్తవమే అయి ఉండవచ్చు.
ఖచ్చితంగా చెప్పాలి అంటే అలా తెలుసుకోవడం నిజంగా సాధ్యమేనా? అందుకు సహకరించని అంశాలు ఏమిటి?
ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని చేసే ప్రయత్నం అప్పటి మీడియములు,
ఆ తరువాత సీనియరు యోగ సాధకులు వ్రాసిన పుస్తకాలు చదవడం, ప్రచారంలో ఉన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవడం మేరకు మాత్రమే జరుగుతోంది అని అనిపిస్తుంది. కానీ, ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే ఒకే అంశం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం. దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ఎవరికి వారు తేల్చుకోలేని విషయమే. ఉదాహరణకు కోర్సులు చేయకూడదు అనే ఒక వర్గం, కోర్సులు చేయవలసిందే అనే వేరొక వర్గం. యోగంలో ట్రీట్మెంటుకు ఉన్న పాత్ర ఏమిటి అనేదానికి సంబంధించి ఉన్న భిన్న అభిప్రాయాలు. జనరల్ ప్రాక్టీసు ఎంతసేపు చేయాలి అనేదాని గురించి భిన్న అభిప్రాయాలు. ఇలా ఇబ్బందికరమైన విషయాలు ఎన్నో. మాస్టరు గారి రికార్డులు మాత్రమే ప్రామాణికం అనే ఒక మాట మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోనవుతుంది.
మీడియములకు సూచనలు ఇస్తూ డైరీలో 14-11-1912 న చెప్పబడిన విషయం ఏమిటి అంటే "ఈ విధానంలో సమస్తమైన ప్రశ్నలు కూలంకషంగా చర్చించబడి, నిర్ణయాలు తీసుకోబడినాయి. అందులో ముఖ్యంగా ఆరిజిను (మూలం) గురించి, సృష్టి విధానం గురించి చెప్పబడింది" అని. ఈ యోగం మాస్టరు గారి ద్వారా ఆరంభించబడి ఉన్నందున, ఎవరెవరు ఏమి చెప్పినా లేదా చెపుతున్నా మరియు ఇతరులు ఎవరెవరు ఏమి వ్రాసినా లేదా వ్రాస్తున్నా, వాటి లోతుల వాస్తవికత సంబంధంగా మాస్టరు గారి చేత వ్రాయబడిన రికార్డులలో వ్రాయబడి ఉన్నవి మాత్రమే అంతిమమైన ప్రామాణికాలుగా తీసుకోబడవలసిన అవసరం.
ఇక అందుకు సహకరించని అంశాలు ఏమిటి అనేవాటిలో పై వాటికి అదనంగా మరొకటి ఏమిటి అంటే వ్యక్తిగతంగా ఎవరెవరి అనుభవం, జ్ఞానం, వాటిని మించి వ్యక్తిగత అనుభూతులు. ఈ విషయం ప్రస్తుతానికి సూచనప్రాయంగా మాత్రమే చెప్పుకోను వీలవుతుంది.
ఇక చివరగా, ప్రస్తుత ప్రశ్న నెం.8 విషయంగా చెప్పుకోబడిన "మనం ప్రస్తుతం చేసే ప్రాక్టీసు అసలైన యోగా ప్రాక్టీసేనా" అనేదాని గురించి. కె. కోర్సు హస్తలిఖిత వాల్యూం 4 లో ప్రాక్టీసుకు సంబంధించి జరిగేదిగా ప్రాక్టీసు సంఖ్య ఒకటి అని మరియు సాధకుని చేత చేయబడవలసినదిగా సంఖ్య రెండు అని వివరించబడి ఉన్నప్పటికీ, వాటికి కొనసాగింపుగా "ఎలా అయినా, ప్రాక్టీసు మాత్రం చేయాలి" అనే అర్థవంతమైన ఊరడింపు మాటయే యోగ సాధక సమాజానికి శిరోధార్యం. నిరంతరం, నిరంతరాయంగా, శ్రద్ధతో ప్రాక్టీసు చేస్తున్నారా లేదా అనేది మాత్రమే ప్రస్తుతం పరిగణనీయం.
సమాధానం నెం.008 - ప్రశ్న నెం.8 (10-5-2021) విషయం "మనం చేసే ప్రాక్టీసు అసలైన యోగా ప్రాక్టీసేనా".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm