1) 7 ప్రశ్నల లోని 2వ ప్రశ్నకు, "ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి" అనే 3వ ప్రశ్నకు సంబంధం ఏమిటి?
2) దీని ముందరి రెండవ ప్రశ్నలో చెప్పుకున్న వరవడి కొనసాగుతోంది అని ముందుగా చెప్పుకోదగిన విషయం. దాని ప్రకారం "మోక్షం అంటే ఏమిటి, ఇది మీకు తెలియాలి" అనే 2వ ప్రశ్నకు "ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించిందీ మీరు తెలుసుకోవాలి" అనే 3వ ప్రశ్నయే సమాధానం. అంటే ఈ భూమి మీద మీరు ఎందుకు జన్మించారో తెలుసుకోవడం లోనే మోక్షం అనే మాటకు అర్థం ఉంది అని. అంటే ఈ భూమి మీద జన్మించడం అనే దానిలోనే మోక్షం అనే మాటకు అసలైన అర్థం ఉంది అని.
3) 3వ ప్రశ్నకు వివరణ ఏమిటి?
4) జన్మించడం జరిగింది. అది కూడ ఈ భూమి మీద జన్మించడం జరిగింది. జన్మించడం అంటే సూక్ష్మం నుండి (ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే సూక్ష్మాతిసూక్ష్మం నుండి) స్థూలానికి లేదా స్థూల జన్మకు రావడమే కదా. అంటే స్థూలంగా ఉన్న ఈ భూమి మీద స్థూల జన్మకు రావడమే కదా. మరి అలాంటపుడు, స్థూల స్థితి నుండి మరల సూక్ష్మ స్థితికి తిరిగి వెనక్కి వెళ్ళడం (అంటే దేముడిలో ఐక్యం అయిపోవడం) అనేది స్థూల ఉనికికి లక్ష్యం (ఇదే కదా మోక్షం అనే మాటకు చెప్పిన అర్థం) అయిన పక్షంలో, స్థూలంగా జన్మకు రావడానికి అర్థం లేదా, స్థూలంగా జన్మకు రాకుండా ఉంటే సరిపోయేది కదా అనే సునిశితమైన లోతుల అంశం సమంజసమే కదా.
5) స్థూలంగా జన్మకు రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా అనేది మేథో సమాధానం అయితే, మరి స్థూలంగా జన్మింపచేసిన సృష్టికర్తకు మానవ మేథస్సు యొక్క బుద్ధిలేనితనాన్ని ఆపాదించడం (భగవంతుడు వేరు, సృష్టికర్త వేరు అని తెలియని కారణంగా భగవంతుడే సృష్టికర్త అనుకుని, భగవంతుడు సృష్టితో ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పడం అంటే అంతే కదా) ఎంతవరకు సబబు. తర్కాన్ని మించిన ఇలాంటి వితర్కం మేథస్సు పరిధి లోనిది కాదు, కేవలం బుద్ధికి మాత్రమే సాధ్యం.
6) ఇంతవరకు చెప్పుకున్న ప్రశ్న యొక్క వివరణకు కొనసాగింపుగా చెప్పుకోదగింది ఏమిటి అంటే ఈ భూమి మీద ఉన్న జీవ సృష్టి ఈ విశ్వంలో గానీ, విశ్వాంతరాళాలలో గానీ లేదు (ఇది శాస్త్రవేత్తలు కూడ నిర్ధారించిన విషయమే), అలాంటి ఈ భూమి మీద (జీవ సృష్టికి అనువయిన మూల వనరులు, వాతావరణం, స్థితులు, పరిస్థితులు కేవలం ఈ భూమి మీద మాత్రమే ఉన్నాయి గనుక) స్థూల జన్మ తీసుకోవడం అనే దానికి అర్థం, పరమార్థం, లక్ష్యం ఉంటుంది, ఉండి తీరుతుంది, ఉండి తీరాలి అనేది మోక్షం అనే మాటకు మేథో స్థాయితో అందుకున్న సమాధానానికి భిన్నంగా మోక్షం అనే మాటకు అసలైన అర్థం తెలియడానికి అవసరమైన ముందస్తు బుద్ధి ప్రక్రియయే కదా.
7) గమనించదగిన విషయం ఏమిటి అంటే 3వ ప్రశ్న కూడ విషయాన్ని లేదా నిర్ధారిత విషయాన్ని యథాతథంగా చెప్పడం కాక, అసలైన సమాధానానికి దారితీసే విధంగా లోతుల నుంచి పాతుకుపోయిన భావనా సంచయాన్ని (లేదా సంపాదించిన జ్ఞానం, అనుభవం సారాన్ని లేదా కర్మ పదార్థాన్ని) కుళ్ళగించి వెలికితీయడం మాత్రమే జరుగుతోంది.
8) ఈ యోగ లక్ష్య సిద్ధిలో ఈ ప్రశ్న యొక్క పాత్ర ఏమిటి?
9) మోక్షానికి లేదా మోక్షం అంటే ఏమిటి అనేదానికి అర్థం తెలుసుకునే క్రమంలో ఏ కూరుకుపోయిన మేథో భావనలు మోక్షం అనే మాటకు విపరీతార్థం ఉదయింప చేయడానికి దారి తీశాయో, వాటిని కదిలించి, కుదిలించి, కుళ్ళగించడమే ఈ మూడవ ప్రశ్న యొక్క ప్రాధాన్యత.
సమాధానం నెం.120 - ప్రశ్న నెం.120 (24-12-2021) విషయం "ఈ యోగం యొక్క గొప్పతనం, 7ప్రశ్నలు - 3వ ప్రశ్న".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm