1) శ్వసింపు అంటే ఏమిటి?
2) మామూలు అర్థంగా శ్వసింపు అంటే జీవులలో/ ప్రాణులలో యాంత్రికంగా జరిగే శ్వాస లోనికి తీసుకోవడం, శ్వాస బయటికి విడవడం అనే ప్రక్రియ. యాంత్రికంగా అనే మాటను ఇంకొంచెం విపులీకరించి చెప్పుకుంటే, మనిషి/ జీవి యొక్క ప్రమేయం లేకుండా శ్వాస లోనికి తీసుకోబడడం మరియు బయటికి విడవబడడం అనే ప్రక్రియ. అదే అక్షర మూలాలకు వెళ్ళి చెప్పుకుంటే, ఉన్న దానికి లేదా ఉన్న ప్రాణానికి/ప్రాణతరంగానికి ఆదరువుగా ఉండే నిమిత్తం ఉన్నది/ ఉంటున్నది/ జరుగుతున్నటువంటిది శ్వాస, అది జరిగే ప్రక్రియయే శ్వసింపు.
3) మనిషిలో, సృష్టి ప్రాణులలో శ్వసింపు యొక్క పాత్ర ఏమిటి?
4) వస్తుతః శ్వాస ప్రక్రియ లేదా శ్వసింపు అనేది మనిషి, సృష్టి జీవి/ ప్రాణి బ్రతికి ఉండడానికి అవసరమైన ప్రక్రియ. శ్వసింపు జరగడం, జరగకపోవడం అనే దానితో మనిషి, జీవి బ్రతికి ఉండడం, మరణించడం అనే దానికి లింకు ఉంది. శ్వసింపు ఉంటే జీవించి ఉండడం, శ్వసింపు ఆగిపోతే మరణించడం.
5) యాంత్రికంగా జరుగుతున్న ఆ శ్వాస ప్రక్రియ మీద మనిషికి ఏమాత్రం అధికారం లేదు, సృష్టి ప్రక్రియగా జరిగే దానికి తన అవసరం నిమిత్తం తాను సాధనంగా ఉండడం తప్ప. బాహ్య/ సృష్టి వాతావరణం లోను మరియు వ్యక్తిగా వ్యక్తి స్థాయి శరీర నిర్మాణత లోను ఉన్న కొన్ని సూక్ష్మాతిసూక్ష్మ అనుగుణ్యతల కారణంగా మాత్రమే శ్వసింపు యాంత్రికంగా జరిగే అవకాశం. అంతే తప్ప, అందులో మనిషి/ జీవి ప్రమేయం శూన్యం. ఆ శ్వాస ప్రక్రియకు, మనిషికి సంక్రమించిన ప్రారబ్ద కర్మకు అవినాభావ సంబంధం ఉంది అనేది నిర్ద్వంద్వ వాస్తవం, సంబంధిత లోతులు ప్రస్తుతానికి తెలియవలసిన అవసరం లేకపోయినప్పటికీ.
6) శ్వసింపుకు, ప్రాణాయామానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
7) రెండూ శ్వాసకు సంబంధించినవే. శ్వసింపు యాంత్రికంగా, ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ. ప్రాణాయామం సాంప్రదాయ బద్ధమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా మనిషి రకరకాల శక్తి వాంఛలతో కావాలని, ప్రమేయం పెట్టుకుని, తానుగా చేసే ప్రక్రియ. ఆ చేసే ప్రక్రియలో ౼దాని లోతులు ప్రత్యేకించి తెలియకపోయినప్పటికీ౼ మామూలుగా శ్వసింపులో జరిగే అంతశ్శ్వాస పరిమాణాన్ని మించి శ్వాస తీసుకోవడం వస్తుతః జరుగుతుంది. ప్రాణాయామానికి లక్ష్యం కుండలినీ శక్తులు సాధించడం అనే అత్యధిక ప్రయోజనం మొదలుకుని ఆరోగ్య పరమైన ఇబ్బందులను తొలగించుకోవడం అనేది వస్తుతః ఉన్నటువంటి విషయం. ఆధ్యాత్మిక ప్రక్రియగా మొదలయిన ప్రాణాయామం సామాజిక స్రవంతిలో కూడ చోటు చేసుకుంది. ప్రాణాయామంలో వస్తుతః పూరకం (క్రమబద్ధంగా శ్వాస తీసుకోవడం), కుంభకం (ప్రాణాయామం చేసే ఉద్దేశ్యాన్ని బట్టి ఆ తీసుకున్న శ్వాసను ఒక నియమిత ప్రాంతంలో నిలిపి ఉంచడం), రేచకం (పూరకానికి సంబంధించే విధంగా వస్తుతః క్రమబద్ధంగా శ్వాస విడవడం) అనేవి భాగాలు.
8) సృష్టి లక్ష్యంలో శ్వసింపుకు ఉన్న పాత్ర ఏమిటి?
9) ప్రాణం నిలిచి ఉండడానికి సృష్టి సంబంధ వ్యక్తి స్థాయి ప్రక్రియగా వ్యక్తికి నిరంతరాయ శ్వసింపు అవసరం. దీనికి సమాంతరంగా జన్మ తరువాత జన్మ తీసుకుంటూ పోయే వ్యక్తి ఉనికికి సంబంధించిన సృష్టి స్థాయి ప్రక్రియగా, వ్యక్తికి ఒక స్థూల సంబంధంగా జననం అంటే మొదటి శ్వాస లేదా శ్వసింపు లేదా ఉచ్ఛ్వాస, మరణం అంటే తుది శ్వాస లేదా శ్వసింపు లేదా నిశ్శ్వాస. అదే, సృష్టికి ఆరంభమే దానికి మొదటి శ్వసింపు, సృష్టికి అంతమే దానికి తుది శ్వసింపు.
10) సృష్టి లక్ష్యం లేదా యోగ లక్ష్యం అయిన అమృతత్వం అనేది వ్యక్తి సంబంధం, సృష్టి సంబంధం కూడ. వ్యక్తి స్థాయికి మరియు సృష్టి స్థాయికి జరిగే శ్వసింపు మూల/ శూన్య స్థితుల, స్థాయిల సంబంధంగా జరగడమే యోగ పరమైన సృష్టి లక్ష్య సంబంధం. సృష్టి ప్రక్రియగా జరిగే శ్వసింపు మూల/ శూన్య స్థితుల, స్థాయిల సంబంధ ప్రక్రియగా జరగవలసిన అవసరం.
సమాధానం నెం.125 - ప్రశ్న నెం.125 (3-1-2022) విషయం "శ్వసింపు".
-
Katakam
- Posts: 3868
- Joined: Sun May 09, 2021 6:18 pm