సమాధానం నెం.175 - ప్రశ్న నెం.175 (13-4-2022) విషయం "భక్తి".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.175 - ప్రశ్న నెం.175 (13-4-2022) విషయం "భక్తి".

Post by Katakam »

1) భక్తి అంటే ఏమిటి?

2) భక్తి అంటే సాధారణంగా చెప్పుకునే అర్థమే విశ్వ వ్యాప్తంగా ప్రచారంలో ఉంది, నమ్మబడుతోంది. భౌతిక అవసరాలు తీరడం కోసం భగవంతుడి/ దేముడి అనుగ్రహం నిమిత్తం ఆయనను కొలిచే/ పూజించే విధానమే భక్తి. అందులో అష్ట విధ భక్తులు అన్నట్లుగా అనేక విధానాలు. ఈ భక్తి వస్తుతః పేరుకు భగవంతుడి సంబంధం అని భావించబడడం జరుగుతున్నప్పటికీ, అది పూర్తిగా దేముడి సంబంధం, దేముళ్ళ సంబంధం. ఏ మతానికి సంబంధించిన దేముడే ఆ మతం వారికి ఏకైక భగవంతుడిగా తీసుకోబడుతున్న పరిస్థితి.

3) మూలాలకు వెళ్ళి విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అంటే, భక్తి అనేది ఆధ్యాత్మికతకు దారితీసే ఒక ఉన్నత మార్గం మాత్రమే. మనిషిని లక్ష్యానికి, మనిషి జన్మ ఎందుకు వచ్చింది అనే లక్ష్యానికి చేర్చడానికి మార్గంగా నమ్మబడిన ఆధ్యాత్మికతకు మార్గం. అంటే దేముడి గురించి, భగవంతుడి గురించి జన్మ లక్ష్యాన్ని సాధించేలా తెలుసుకోవడానికి మార్గం. కానీ, భక్తి అనేది కాల గమనంలో మనిషి జీవనం లోని భౌతిక స్థాయి కోరికలు తీర్చమని కోరుకోవడానికి మాత్రమే సాధనం అయిపోయింది.

4) మానవ జీవనంలో భక్తి యొక్క పాత్ర ఏమిటి?

5) మానవ జీవనంలో భక్తిది కేవలం పాత్ర -అంటే ఒక భాగం- కాదు, సమస్తమే, విశ్వరూపమే. మనిషి తత్త్వంలో అణువణువునా భక్తి నిండిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, భక్తి అంటే భౌతికమైన కోరికలు తీర్చమని కోరుకోవడానికి, భక్తి పేరుతో ముడుపులు కానుకలు నివేదనలు చెల్లించడానికి, ముడుపులు కానుకల పేరుతో ఇచ్చే లంచాలకు ప్రతిఫలం లేని పక్షంలో సదరు భగవంతుణ్ణి/ దేముణ్ణి దుర్భాషలాడడానికి ఏకైక సాధనం అయిపోయింది. కానీ, ఆధ్యాత్మికతకు దారితీసేదిగా భావించబడిన అసలైన భక్తి పూర్తిగా మటుమాయం అయిపోయి, భౌతిక స్థాయి భుక్తికి (జీవనం గడవడానికి, అందులో భాగంగా వివిధ స్థాయిల కోరికలు తీర్చమని కోరుకోవడానికి) ఆలవాలం అయిపోయింది. అది ఎంతవరకు అంటే తమ భౌతిక స్థాయి కోరికలు తీరడం అనేది ఇతరుల మీద ఆధిపత్యం కనబరచడానికి అర్హతగా పరిగణించబడుతోంది.

6) రాను రాను భక్తి లుప్తమై పోయి, దైవానుసంధానకర్తల లేదా పూజాదికాలను నిర్వహించేవారి పుణ్యమా అని అది భయంగా -అంటే పూజాదికాలను సక్రమంగా నిర్వహించకపోవడం, వాటిలో తప్పులు దొర్లడం లాంటి వాటి పరంగా మూర్తీభవించిన భయంగా- రూపాంతరం చెందింది. ఆధ్యాత్మికత నుండి దిగజారి ఇష్టాపూర్తికి, ఇష్టాపూర్తి నుండి దిగజారి భయానికి దారితీసిన భక్తి, మనిషికి భౌతికాన్ని మించిన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో విఫలం అయిందని చెప్పుకోవడం ఎంతయినా సమంజసం.

7) భక్తి అనే మాటకు సాంప్రదాయ బద్ధంగా చెప్పిన లోతుల అర్థం యోగ సంబంధం లేదా సృష్టి లక్ష్య సంబంధం అని చెప్పుకోనవుతుందా? ఎలా?

8) భక్తి అనే మాటకు పైన చెప్పుకున్న అర్థం కూడ సాంప్రదాయబద్ధంగా దేముళ్ళ సంబంధంగా చెప్పబడి దిగజారిపోయిందే అయినప్పటికీ, సాంప్రదాయబద్ధంగానే లోతుల అర్థం కూడ చెప్పబడి ఉంది 'స్వ స్వ రూప అనుసంధానమే భక్తి అని అనబడుతుంది' మరియు 'స్వ ఆత్మ తత్త్వ అనుసంధానమే భక్తి అని అనబడుతుంది' అని. సామాజిక స్రవంతిలో చెప్పుకోబడుతున్న, నమ్మబడుతున్న అర్థానికి ఇది పూర్తిగా విరుద్ధం. సృష్టి లక్ష్యానికి మరియు ఈ యోగానికి అనుగుణమైన అర్థాన్ని కలిగి ఉన్న పదజాలాలు.

9) భక్తి అనే మాటకు లోతుల అర్థంగా చెప్పబడిన సాంప్రదాయ బద్ధ పదజాలాలకు వివరణ చెప్పుకోవలసిన సందర్భం కాకపోయినప్పటికీ, చెప్పుకోదగిన ఒక విషయం ఏమిటి అంటే భక్తి అనే మాటకు చెప్పిన లోతుల అర్థం మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న లిఖించబడిన " 'ఏకం' ఆ 'ఏకం' ను చూడాలి" అనే అర్థానికి సరిపోలుతుంది, సరిపోతుంది. దీనిని బట్టి చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే భక్తి అనే మాటకు సాంప్రదాయ బద్ధంగా చెప్పిన లోతుల అర్థం యోగ సంబంధం మరియు సృష్టి లక్ష్య సంబంధం అని చెప్పుకోనవుతుంది అని.
Post Reply