సమాధానం నెం.062 - ప్రశ్న నెం.062 (30-8-2021) విషయం "ప్రేమ".

పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు లేదా వివరణ సహిత సమాధానాలు...
Post Reply
Katakam
Posts: 3864
Joined: Sun May 09, 2021 6:18 pm

సమాధానం నెం.062 - ప్రశ్న నెం.062 (30-8-2021) విషయం "ప్రేమ".

Post by Katakam »

1) ప్రేమ అంటే ఏమిటి?

2) జీవ సృష్టిలో సృష్టి సంబంధమైన ప్రప్రథమ లక్షణం ప్రేమ. ఆంతరికపు అందని లోతుల నుండి స్థూల సంబంధమైన నేను, నాది అనే భావనగా బయటపడేది ప్రేమ. ఇది సమస్త జీవరాశికి సంబంధించింది. లోహ దశలో వ్యక్తం కానిది, వృక్ష దశలో వ్యక్తమైనా అంత తేలికగా తెలియబడనిది, జంతు. దశలో ప్రస్ఫుటంగా తెలియబడేది, మనిషి దశను శాసిస్తున్నది ప్రేమ.

3) ప్రేమకు, మనిషికి సంబంధం ఏమిటి?

4) పైన చెప్పుకున్నట్లుగా, మనిషి దశను శాసిస్తున్నది ప్రేమ. మనిషి దశలో పనిచేసే మంచి, చెడు లక్షణాలకు మూలం ప్రేమ. మనిషిని ప్రగతి బాటలో నడిపించడానికి గానీ, పతనం దిశగా దిగజార్చడానికి గానీ పనిచేయగలిగే సమర్థమైన లక్షణం ప్రేమ. నాది అనుకున్న దాని మీద ఉండే అవ్యాజమైన ప్రేమయే, నాది కాదు అనుకున్న దాని మీద ద్వేషంగా, ఈర్ష్యగా, అసూయగా, కోపంగా, కక్షగా, కసిగా, పగగా, ప్రతీకారంగా పరిణమిస్తుంది. కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అనే అరిషడ్వర్గాలకు మూలం ప్రేమ. సమస్త దుర్నీతికి మూలం ప్రేమ.
సృష్టి వ్యవస్థకు, ప్రపంచ వ్యవస్థకు సమాంతరమైన కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తతలతో ఛిన్నాభిన్నం కావడానికి కారణం ప్రేమ. ఒకే వ్యక్తిలో పనిచేసే తల్లి, అత్త అనే పాత్రల మధ్యన ఉన్న వైషమ్యమే ఇందుకు ఖండించడానికి వీల్లేని ఉన్నత, ఉత్తమ ఉదాహరణ.

5) ప్రేమకు, సృష్టికి సంబంధం ఏమిటి?

6) వసుధైక కుటుంబంలో మధురాతిమధురమైన మాట అయి ఉండి నా అనుకున్న చోట వెల్లివిరిసే సత్సంబంధాల ప్రేమయే దానికి విరుద్ధంగా విషాన్ని చిమ్మడానికి కూడ కారణం కాగలిగిన లక్షణం. యుగయుగాల మానవ చరిత్ర రక్తసిక్తం కావడానికి కారణం రెండవ పార్శ్వపు ప్రేమయే. నాది అనుకున్న దానిని రకరకాల ఉద్దేశ్యాలతో నాశనం చేయడమే మానవత రక్తమోడడానికి కారణం. అదే ప్రేమ యొక్క విభిన్న పార్శ్వపు నైజం.

7) సృష్టి సమస్తం కుటుంబ వ్యవస్థ అనే స్తంభాల మీదనే నిర్మితమై ఉంది. ఆ స్తంభాలకు తుప్పు లేదా చెదలు ప్రేమయే. ప్రస్తుత సృష్టి భ్రష్టుపట్టి పోవడానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా శక్తితత్త్వ సమన్వితమైన ఉభయ పార్శ్వాల ప్రేమయే.

8) విశ్వజనీన ప్రేమ అనేది వ్యక్తికి సూత్రప్రాయంగా చెప్పుకోవడానికి మాత్రమే సంబంధం. నిర్మాణ కార్యక్రమం అనే ఊహాజనిత ఆకాశ హర్మ్యాన్ని మించి దిగజారడం, దిగజార్చడం అనే దానికి విశేషంగా స్థూల స్థాయి వెన్నుదన్నుగా నిలిచిన ప్రేమ నాకు, నాది అనే తత్త్వం నుంచి బయటపడితే, ఆ ప్రేమయే సర్వసమానత్వం అనే అనూహ్య కార్యక్రమానికి నాంది కాగలుగుతుంది. కానీ, నాకు నాది అనేదే ప్రేమకు పునాది, ప్రేమ స్వరూపం గనుక, ప్రేమ లుప్తం కావడం లేదా లేకుండా పోవడం మాత్రమే ఏకైక మార్గం. పరోక్షంగా మాస్టర్ సీ.వీ.వీ. నమస్కారం అనే మాస్టరు నామంలో, శక్తిమయ సృష్టి ప్రాణమయ సృష్టిగా రూపాంతరం చెందవలసిన అవసరాన్ని ప్రతిపాదించిన మాస్టరు నామంలో మూలసూత్ర పరంగా ఇమిడి ఉన్న అర్థం ఇదే.

9) మనిషి మనుగడలో ప్రేమ పాత్ర ఏమిటి?

10) పేరుకు ప్రశ్న వేసుకున్నా, పైన చెప్పుకున్నది మొత్తం మనిషికి సంబంధించిందే, మనిషిలోని ప్రేమకు సంబంధించిందే. మనిషిలోని కేంద్రతమ కేంద్రంలో ఛాయామాత్రంగా ఉన్న దివ్యత్వం మనిషిలో పాదుకోవాలి లేదా దివ్యత్వమే మనిషి రూపం కావాలి లేదా మనిషిలోని ద్వంద్వత్వం ఏకంకు చేరుకోవాలి అంటే స్వార్థానికి మారు రూపమైన నేను, నాకు, నాది అనే ప్రేమ శూన్యం కావలసిందే.
Post Reply